తెలంగాణ రాజకీయం

మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని

 విభజన చట్టంలో భాగంగా పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం జూన్ రెండో తేదీతో ముగుస్తుంది. అందుకే హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఏపీ వర్గాల నుంచి వస్తోంది . తాజాగా  సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-5ను ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు. ఆ మేరకు భారత రాష్ట్రపతి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని వీవీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం  ఏర్పడింది  

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చేసి ఏపీలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. ట్రాన్సిట్ భవనాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పాలన అంతా అమరావతి గానే సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో  మాత్రం ఇప్పటికీ అమరావతి రాజధానే. అయితే  2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది. చట్టపరమైన సమస్యలతో మూడు రాజధానులు వైసీపీ ఏర్పాటు చేయలేకపోయింది. కనీసం అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కూడా సిద్దపడటం లేదు. దీంతో గందరగోళంగా మారింది. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట వైసీపీ నేతలే ఉమ్మడి రాజధానిని పొడిగించాలన్న డిమాండ్ వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ డిమాండ్ వినిపించారు. తర్వాత సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు జేడీ లక్ష్మినారాయణ మాత్రమే ఈ డిమాండ్ వినపిిస్తున్నారు. నిజానికి ఉమ్మడి రాజధాని అన్న పేరే కానీ ఏపీ వ్యవహారాలు ఏమీ హైదరాబాద్ నుంచి జరగడం లేదు. ఆ ప్రివిలేజ్ ఎప్పుడూ ఏపీ వాడుకోలేదు. కొన్ని  భవనాలు తప్ప ఏవీ ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఆ భవనాలను వాడుకున్నది కూడా తక్కువే.