ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పవన్ చెప్పినట్టే… హ్యూమన్ ట్రాఫికింగా…

అనేక మంది మహిళలు, తెలుగు వాళ్లు అదృశ్య మవుతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు గతంలో సంచలనం సృష్టించాయి. అయితే అదంతా అబద్దమని ఆయనపై కేసులు కూడా పెట్టింది  ప్రభుత్వం. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఘటనలు చూస్తే  పవన్ కళ్యాణ్ భయపడినట్టే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఒక్క కంబోడియా లోనే బానిసలుగా 5000 మంది మనవాళ్ళు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వైజాగ్ పోలీసులు చాకచక్యం తో రక్షించిన 58 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు చెబుతున్న విషయాలు సామాన్యుల్ని భయానికి గురి చేస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళి చైనా  గ్యాంగ్ లకు అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. అలా కొనుక్కున్న భారతీయుల్ని హింసించి మనదేశం పైనే సైబర్ దాడి చేసే ఆయుధాలుగా మారుస్తున్నారు. వీరిలో 58 మందిని రక్షించి వైజాగ్ కు తీసుకొచ్చారు వైజాగ్ పోలీసులు.వీరిలో 40 మంది తెలుగువాళ్ళు కాగా మిగిలిన 18 మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు.

విదేశాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్‌ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు  లక్షన్నర చొప్పన చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్‌ బాధితులను రిసీవ్‌ చేసుకొని కంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్‌ వీసా చేయించి ఆ గ్యాంగ్‌ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్‌ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్‌ ఆదేశాలు జారీ చేశారు.  ఇంకా వేర్వేరుముఠాలు ఇలా పెద్ద ఎత్తున ఉద్యోగాల పేరుతో ఇక్కడి వ్యక్తుల్ని తరలించారని.. వారిలో మహిళలు కూడా ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.  జనసేన అధినేత..సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఏపీ నుండి పెద్ద ఎత్తున ట్రాఫికింగ్ జరుగుతోందని అన్నారు.ఆయన కామెంట్స్ పై పెద్ద యెత్తున దుమారం రేగింది . ఇప్పుడు అలాంటి తరహా కేసులే వెల్లడి కావడంతో  రాజకీయంగానూ దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.  పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు  బృందం  ద్వారా ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.