kcr
తెలంగాణ రాజకీయం

కేసీఆర్ ముద్ర చేరిపేసేందుకు… 3 నిర్ణయాలు

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పదేళ్లు అధికారంలో ఉండి గద్దె దిగే వరకు కేసీఆర్‌ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ పితగా సొంత పార్టీ నేతలు కీర్తిస్తూ.. ఆ అభి ప్రాయాన్ని ప్రజల్లోకి జొప్పించే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్‌కు తెలంగాణలో ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కేసీఆర్‌ ముద్ర చెరిపేసే ప్రయత్నాలు చేపట్టారు. ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు నాయకుడు అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. చంద్రబాబు ముద్ర చెరిపేలా మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు.

చంద్రబాబు విధానాలను మార్చారు. విశాఖను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నిస్తూ తద్వారా తన ముద్ర వేసుకోవాలని సూస్తున్నారు. ఈక్రమంలో జగన్‌ తీరును విమర్శించిన టీడీపీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు చెబుతోంది.ఏపీలో చంద్రబాబు, జగన్‌ తరహాలోనే తెలంగాణలో రేవంత్‌రెడ్డి కూడా మాజీ సీఎం ముద్రను చెరిపేసేలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రగీతాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. తెలంగాణ తల్లికి తుదిరూపు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నం విషయంలోనూ కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా చిత్రకారుడు రుద్ర రాజేశ్‌తో చర్చలు జరిపారు. కీలక సూచనలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ జాతిపితగా జయశంకర్‌ను తెరపైకి తెచ్చారు. మొత్తంగా కేసీఆర్‌ ముద్ర లేకుండా చేస్తున్నారు. తద్వారా తెలంగాణలో అధికారం మారితే విధానాలు మారతాయన్న సంకేతం ఇస్తున్నారు. రెండు రాష్ట్రాలో ఇలాగే వ్యవహరిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కేసీఆర్‌ స్థానం ఆక్రమించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న అభి ప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది అంత ఈజీ కాదంటున్నారు. విధానపరమైన మార్పులు చేసినంత మాత్రాన ఒకరి గుర్తింపును చెరిపేయాలని భావించడం సరికాదంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తమిళనాట ఉండేవని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆ సంస్కృతి మారడం మంచిది కాదని పేర్కొంటు న్నారు. కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని రేవంత్‌ ప్రయత్నిస్తున్నా.. కేసీఆర్‌ స్థాయిలో గుర్తింపు రావడం కష్టమని పేర్కొంటున్నారు.