ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీకీ ఎడ్జ్…సెఫాలజిస్ట్ అంచనాలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కలు మాత్రం తేలడం లేదు. అంచ నాలకు అందడం లేదు. ఎవరి లెక్కలు వారివే. ఎవరి ధీమా వారిదే. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధైర్యాన్ని క్యాడర్ కు నూరిపోస్తున్నారు. కౌంటింగ్ వరకూ క్యాడర్ బలంగా నిలబడాలనే కోరిక కావచ్చు. పార్టీ కిందిస్థాయిలో నీరుగారకుండా ఉండే ప్రయత్నం కావచ్చు. ఇటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష కూటమి పార్టీలు గెలుపుపై మాత్రం కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి. అయితే పోలింగ్ పర్సంటేజీ వల్లనే అంచనాలకు వస్తున్నారు. అందులో ఎంత వరకూ సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే అనేక రకాలైన ఊహాగానాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్యాలను కూడా నేతలు ఈసారి బలంగా నమ్ముతున్నారంటే ఇక ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఎవరికీ అందని అంచనాలకు విధంగా ఈసారి పోలింగ్ జరిగిందని మాత్రం చెప్పాలి.

ఎవరి వాదన వారికున్నా .. ఈవీఎంలు తెరిచేంత వరకూ అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనేది చెప్పలేం. అందుకే తమ గ్రహస్థితి.. పరిస్థితులను బట్టి జ్యోతిష్యులను అనేక మంది నేతలు ఆశ్రయించి కొంత బీపీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఫస్ట్ టైం షిర్డీయాత్ర చేసి వచ్చారంటే ఆయనలోనూ గెలుపు భయం ఉన్నట్లే కనిపిస్తుందని చెప్పక తప్పదు. అలాగే వైసీపీ నేతల మీడియా సమావేశాలు చూస్తుంటే తమ విజయానికి ఎన్నికల కమిషన్, అధికారులు అడ్డుకట్ట వేశారన్న అభిప్రాయం వారు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక సెఫాలజిస్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్ప డింది. అనేక మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను తెలుసుకోవడంలో నేతలు మునిగిపోయారు. ఒక సెఫాలజిస్ట్ చెప్పింది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రకరకాల పోస్టు పోల్ సర్వేలు పరిశీలించిన అనంతరం ఏపీలో ఆయా వర్గాలు ఏ పార్టీకి ఓట్లు వేశారన్నదానిపై ఓ సెఫాలజిస్ట్ అంచనాలు ఇలా ఉన్నాయి.

ఏపీ జనాభాలో 27 శాతం ఉన్న కాపు, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులలో 60 శాతం మంది కూటమికి ఓట్లు వేశారు. 37 శాతం మంది వైసీపీకి, 3 శాతం ఇతరులకు మద్దతు ఇచ్చారు. ఏపీ జనాభాలో 73 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో 70 శాతం మంది వైసీపీకి ఓట్లు వేశారు. 26 శాతం మంది కూటమికి మద్దతు ఇవ్వగా 4 శాతం మంది ఇతరులకు ఓటు వేశారు. అంటే ఈ సెఫాలజిస్ట్ అంచనా వైసీపీకి ఎడ్జ్ ఉందనే చెప్పకనే చెప్పినట్లయింది.  మరోవైపు పార్టీ అగ్రనేతలు తమకున్న పరిచయాలతో ఎగ్జిట్ పోల్స్ ను ముందు గానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడానికి వీలు లేక పోవడంతో ముందుగా తెలుసుకునేందుకు హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో మీడియా ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చేసి తమకున్న పరిచయాలను ఉపయోగించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రయత్నం చేస్తు న్నారు.

ఇక గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సక్సెస్ అయిన ప్రయివేటు సంస్థలకు కూడా తమకున్న పరిచయాలను ఉపయోగించి ముందుగా అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కంటి తుడుపే అయినా.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం కాకపోయినా.. అదొక స్వాంతన చేకూరుస్తుందన్న కారణంతోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పకనే తెలుస్తుంది. ఓటర్లు మాత్రం అత్యధికంగా వచ్చి ఓటేసి గుంభనంగా వెళ్లిపోయారు. ఇక మిగిలింది నేతలకు టెన్షన్ మాత్రమే.