అంతర్జాతీయం

150 దేశాలకు కొత్త వంగడాలు

ఆధునిక సాగు విధానాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్రిసాట్‌ కృషి చేస్తున్నది. శాస్త్రీయ విధానాలు, కొత్త వంగడాల ఆవిష్కరణలతోపాటు, జన్యు బ్యాంక్‌ సాయంతో అంతరించి పోతున్న ఆహార పంటలను సంరక్షిస్తూ రైతులకు అందిస్తున్నది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా సాగు, పంటల నిర్వహణతో రైతుల ఆదాయం, ఆహార పంటల దిగుబడి, పర్యావరణంలో కార్బన్‌ ఎమిషన్‌ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలను కొనసాగిస్తూనే.. జెనీ బ్యాంక్‌ ద్వారా పరిశోధన సేవలను ఖండాంతరాలకు ఇక్రిసాట్‌ విస్తరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఇక్రిసాట్‌ పరిశోధన ఫలాలను అందిస్తుండగా.. ఇప్పటివరకు 1.65 మిలియన్ల సీడ్‌ శాంపిళ్లను పలు ప్రాంతాలకు చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లకు ఇక్రిసాట్‌ పరిష్కారం చూపే క్రమంలో భాగంగా జెనీ బ్యాంక్‌ ద్వారా అంతరించి పోతున్న ఆహార పంటలను సంరక్షిస్తున్నది. ప్రధానంగా కందులు, బఠాణీ, వేరుశనగతో పాటు 8 రకాల చిరుధాన్యాల జన్యులను సంరక్షిస్తూ.. వినూత్న వంగడాలను ప్రపంచదేశాలకు అందిస్తున్నది.

కరువు, నీటి లవణీయత, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వంగడాలను అభివృద్ధి పరుస్తూ.. వాతావరణ మార్పులకు ధీటుగా అధిక దిగుబడిని సాధించేలా కృషి చేస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటివరకు 150 దేశాలకు 1.65 మిలియన్ల విత్తన శాంపిళ్లను అందించింది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత కారణంగా అంతరించిపోతున్న ఎన్నో రకాల ఆహార పంటలను సంరక్షించేందుకు పరిశోధనలు చేస్తుండగా.. ప్రధాన ఆహార పంటల్లో ఒకటైన సజ్జలను 25వేల జెర్మ్‌ ప్లాజమ్‌ నిల్వ చేసి అందించారు. 93 దేశాలకు వేరుశనగ, 61 దేశాలకు బఠాణీ, 72 దేశాలకు కందులు, 93 దేశాలకు జొన్నలు, 51 దేశాలకు సజ్జలు, మరో 51 దేశాలకు చిరుధాన్యాల విత్తన బ్యాంక్‌ను అందించి వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఇక్రిసాట్‌ డెవలప్‌ చేసిన వంగడాలను వినియోగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.