ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీసీ నాయకులు కొందరు విచిత్రమైన పరిస్థితి అనుభవిస్తున్నారట. పోటా పోటీగా సై అంటే సై అనేలా సాగినా ఎన్నికలలో అత్యంత కీలమైన పోల్ మేనేజ్‌మెంట్‌లో సూపర్ సక్సెస్ అయ్యామని భావించిన నేతలకు పోలింగ్ తరువాత బూత్‌ల వారీగా ఓటింగ్ శాతంపై చేపట్టిన లెక్కలు షాక్ ఇస్తున్నా యంట. ఓటింగ్ అప్పుడు పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా చేసామనుకున్న అభ్యర్ధులు అందులో జరిగిన లొసుగులు బయటకు రావడంతో తెగ ఆందోళన చెందుతున్నారంట. ఎన్నికల ముందు అసంతృప్తి గా కొందరు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు చేతివాటం గట్టిగానే చూపించారని అభ్యర్ధుల సమీక్షల్లో వెల్లడైందంటున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలను ఎన్నికల ముందు వారిని బుజ్జిగించి, బతిమాలి నయానో, భయానో వారి ఎన్నికలకు సిద్ధం చేశామనుకుంటే చివరికి ఇలా చేస్తారా అంటూ కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు రగిలిపోతున్నట్లు తెలిసింది.
ఆ కుచ్చుటోపీలు పెట్టిన పరిస్థితి ముఖ్యంగా కుప్పం, నగరి, కాళహస్తి, పలమనేరు, సత్యవేడు, జీడినెల్లూరు, పూతలపట్టు, తంబళ్ళపల్లె , మదనపల్లెలో బాగా ఎక్కువ జరిగినట్లు అధికార పార్టీ శ్రేణులు అంటున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టి ఎలాగైనా గెలవడానికి వైసీపీ అక్కడ ఓటుకు నాలుగు వేల వరకు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు వరకు అక్కడి వైసిపిలో గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎమ్మెల్యే అభ్యర్ధి అయిన ఎమ్మెల్సీ భరత్‌కు వ్యతిరేకంగా పనిచేశారు.. అ గొడవలను మంత్రి పెద్దిరెడ్డి చక్కదిద్దారు. దాంతో తిరిగి యాక్టివ్ అయిన అసంతృప్తి నేతలు పోల్ మేనేజ్‌మెంట్ సమయంలో చేయాల్సిన పనిని పూర్తిస్దాయిలో చేయకుండా.. యాండ్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా పనులు లేకుండా .. చేసిన పనులకు బిల్లులు రాకుండా ఉన్న కొందరు నేతలు.. పోల్ మేనేజ్‌మెంట్ లో చేయాల్సిన ఖర్చు పూర్తి స్ధాయిలో చేయకుండా సొంత మేనేజ్‌మెంట్ చూసుకున్నారంట. నగరిలో ఓటుకు రెండువేల వరకు ఇవ్వడానికి మంత్రి రోజా టీం పార్టీ నేతలకు నోట్ల కట్టలు పంచిపెట్టిందంట.
అది కూడా పూర్తి స్ధాయిలో ఓటర్లకు చేరలేదన్నసమాచారంతో మంత్రి రోజా ఫైర్ అవుతున్నారంట. ఎందుకు చేయలేదని లెక్కలు చెప్పాలని ఆమె నిలదీస్తుండటంతో కొందరు నేతలు సీన్‌లో లేకుండా మాయమై పోయారంట. అసలే పార్టీలో మంచి పట్టున్న అసంతృప్తి నేతలు పోలింగ్ ముందు పార్టీ మారడంతో ఢీలా పడిన రోజా టీం తాజాగా నమ్ముకున్న వారే టోపీ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడిందంటున్నారు. పలమనేరులో వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడాకు స్దానిక నేతలు ఇలానే షాక్ ఇచ్చారట. అనుకున్నంతగా స్ధాయిలో పోల్ మేనేజ్‌మెంట్ జరగలేదని తెలిసి ఆయన నీరస పడిపోయారంట. తాను పంచిన మొత్తానికి ఓటర్లకు చేరిన అమౌంట్‌కు పొంతన కుదరక తలపట్టుకుని వాపోతున్నారంట.ఇక కాళహస్తిలో బియ్యపు మధుసుధన్ రెడ్డి, తంబళ్ళపల్లెలో ద్వారకానాధ్‌రెడ్డికి స్థానిక నేతలు హ్యాండ్ ఇచ్చి సొంత ఇళ్లులు చక్కపెట్టుకున్నారని తేలిందంట.తిరుపతి , చంద్రగిరి, పుంగనూరు, పీలేరులో మాత్రమే వైసీపీ అభ్యర్ధుల మేనేజ్‌మెంట్ సక్రమంగా నడిచిందంటున్నారు.
అక్కడి అభ్యర్ధులు నమ్ముకున్న వారు పూర్తి స్ధాయిలో అనుకున్న విధంగా ఖర్చు పెట్డారట. డినెల్లూరు, సత్యవేడు, పూతలపట్టుల్లో అభ్యర్ధులను అక్కడి వైసీపీ శ్రేణులు దారుణంగా మోసం చేశాయని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి జిల్లా వ్యాప్తంగా వైసిపినే ఓట్ల కోసం ఎక్కువ ఖర్చుపెట్టిందంటున్నారు. డీపీ అందులో సగమే ఖర్చు చేసిందంట. టీడీపీ పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరిగితే .. వైసిపి అసంతృప్తి కేడర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారనే సమాచారం. కౌంటింగ్ టైం దగ్గర పడిన తరుణంలో వైసీపీ అభ్యర్ధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందటఅలాంటి వారిని కొన్నిచోట్ల లెక్కలు తీసి ప్రశ్నిస్తే.. తాము నగదు పంచామని తమని అనుమానించడం ఏంటని సదరు లోకల్ లీడర్లు ఎదురు తిరుగుతున్నా రంట. దాంతో సదరు కేండెట్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తేలు కుట్టిన దొంగల్లా ఉండి పోతున్నా రంట. ఎన్నికల ముందు వరకు అసంతృప్తి గా నేతలను దారికి తెచ్చుకుని ఎన్నికలకు వెళితే చివరి సమయంలో ఇలా షాక్ ఇచ్చారని తెగ ఇదై పోతున్నారంట.
అయితే అలా సెల్ప్ మేనేజ్‌మెంట్ చూసుకున్న నేతలు మాత్రం ఐదేళ్ళు తమకు పట్టించుకోలేదు కాబట్టే కొంత సైడ్ వేశామని.. ఇప్పుడు గెలిపిస్తే మరో అయిదేళ్లు తమను పట్టించుకోరు కాబట్టే అలా చేసినట్లు బహిరంగంగానే చేబుతున్నారు. మొత్తానికి అసమ్మతి నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు సరైన టైం చూసి ఇలా చేయడం. పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో అని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకోవాల్సి వస్తుందిప్పుడు.