ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. కేంద్రంలో అతికష్టం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి మధ్య ఎవరు ఊహించని రీతిలో పోటీ నెలకొంది. 400 సీట్లు కచ్చితంగా సాధిస్తామన్న బీజేపీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. 300 సీట్లు దాటేందుకు కూడా బీజేపీకి కూటమి అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. అక్కడ 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే యూపీలో చాలా దారుణమైన పరిస్థితుల్లో బీజేపీ ఉంది. యూపీలో మెజారిటీ సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకుంటోంది. సమాజ్‌వాదీ పార్టీ సత్తా చాటింది. ఇండియా కూటమి అక్కడ 45 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ కొంపముంచాయి. గత ఎన్నికల్లో 62 సీట్లలో గెలిచిన బీజేపీ ఈసారి మాత్రం 30కి పైగా సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.బిహార్‌లో మాత్రం ఎన్డీఏ కూటమికి కాస్త ఊరట లభించింది.
ఇండియా కూటమిపై అక్కడ బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించింది. వాస్తవానికి ఇక్కడ కూడా ఇండియా కూటమికి ఆధిక్యం లభిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కేది. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. 2024 ఎన్నికల తరువాత 100 సీట్లకు చేరువలో కాంగ్రెస్ ఉంది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ దేశవ్యాప్త ప్రచారం పార్టీకి బాగా కలిసివచ్చింది. గతంలో పోలిస్తే మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెసయ్యారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారం బాగా కలిసి వచ్చింది. యూపీ , మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యం బీజేపీ కొంపముంచింది. ఉద్దవ్ వర్గం తమదే అసలైన శివసేన నిరూపించుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు బీజేపీ కొంపముంచినట్టు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
పంజాబ్ , హర్యానా , యూపీ , రాజస్థాన్‌లో బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి రైతుల వ్యతిరేకతే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా ఏర్పాటయ్యే NDA ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషించబోయే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీయేలో రెండవ అతి పెద్ద పార్టీగా టీడీపీ పాగా వేసే సూచనలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో కూడా టీడీపీ చక్రం తిప్పే చాన్స్ ఉంది.