పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగిన సమయంలో.. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు. అయితే తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలతో కూటమి అధికారంలోకి రానుండగా.. పవన్ కల్యాణ్ సైతం గెలుపొందారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సూటిగా సవాల్ విసురుతున్నారు.ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిచారు. మరి మీరు పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ ముద్రగడ పద్మనాభంను వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పేరు మార్చుకునే క్రమంలో మీరు ఏ పేరు పెట్టుకుంటారంటూ వారు సందేహం సైతం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు ఉన్నారు కనుక పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవాలని ముద్రగడకు ఈ సందర్భంగా వారు సూచిస్తున్నారు.
అయితే నామకరణం మార్పు డేట్.. టైమ్ చేబితే తామంతా ఆ కార్యక్రమానికి వస్తామని ముద్రగడకు నెటిజన్లు సూచిస్తున్నారు.తాజా ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని ఈ సందర్భంగ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీ మారే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అంటూ ముద్రగడ పద్మనాభంను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే.. పేరు మార్పు కార్యక్రమం వాయిదా వేసుకోవాలని ఆయనకు ఉచిత సలహా ఇస్తున్నారు. మరోవైపు ఎన్నికల వేళ.. ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఆరోపణలు సంధించారు. ఆ వెంటనే ఆయన కుమార్తె సైతం స్పందించారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోపణల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని సైతం ఈ సందర్భంగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు.