తెలంగాణ రాజకీయం

ది మోస్ట్ లూసర్.. రేవంత్ రెడ్డి

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గణనీయంగా పడిపోయిన, ఓడిపోయిన, పారిపోయిన వ్యక్తి ఎవరంటే.. అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్.
ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం  పార్టీ రాష్ట్ర కార్యాలం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఓడిపోయారు.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారు. తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించారు. పార్ల మెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిస్తే.. ఆ విజయంలో రేవంత్ రెడ్డి పాత్ర నామమాత్రమేనని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ గెలిచిందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖాతానే.. నల్గొండలో విజయానికి కారణం జానారెడ్డి బలమే కారణమని.. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం వల్ల కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. వరంగల్ లో కొంతకాలం క్రితం కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికున్న రాజకీయ బలంతోనే కాంగ్రెస్ గట్టెక్కింది.

పెద్దపల్లి లో వెంకటస్వామి గారి కుటుంబానికి చెందిన వ్యక్తి పోటీలో ఉండటమే కారణమని విశ్లేషించారు. అంతేకాని… ఏ పార్లమెంటు నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డి పాత్ర లేదంటూ, అసలు ఆయన ప్రభావమే లేదంటూ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి, దుస్థితి ఇలా ఉందంటూ సెటైర్లు విసిరారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో, విద్యుత్ కొరతతో రైతులు తమతమవుతున్నారని.. విత్తనాల కోసం బారులు తీరి లైన్లు కడుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూనే… సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పాలనపై, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పుణ్యం వల్లనే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు ఉన్న సంబంధాలు, అనుబంధం వల్లే కాంగ్రెస్ 8 సీట్లలో గెలుపొందిందంటూ ఆరోపించారు.

పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రెఫరండం అంటూ రేవంత్ ప్రకటించారు.. అసలు తన వల్ల కాంగ్రెస్ పార్టీకి గెలుపే సాధ్యం కాలేదు. అటువంటి వ్యక్తులు నరేంద్ర మోదీ గారిని విమర్శించడం సిగ్గుచేటంటూ నిప్పులు చెరిగారు. కనీసం డిసెంబర్ 9 వరకైనా తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలనే ఆరాటంతో రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానిస్తామంటూ ప్రకటించి, సోనియా మెప్పుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. డిసెంబరు 9 తెలంగాణ ప్రజలు ఆవేదనకు గురయ్యే రోజని.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, వెనక్కి తీసుకున్న రోజంటూ ఎద్దేవా చేశారు.  మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని గణనీయంగా పెంచుకుని 8 సీట్లను కైవసం చేసుకుంది.

ప్రజలు బిజెపి ని ఒక బలీయమైన శక్తిగా గుర్తించి గెలిపించారని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తెలిపారు. నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని కొనియాడారు. ఎన్డీయే ప్రభుత్వం అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ, ప్రజల ఆలోచలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ వెల్లడించారు.