bjp
జాతీయం రాజకీయం

13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం….

సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో కేంద్రంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 244 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ 99 సీట్లు రాగా, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఇక పార్లమెంటు ఎన్నికలతోపాటు దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలో అధికార పార్టీలు మళ్లీ గెలిచాయి. ఇక ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సర్కార్‌ ఏర్పాటు చేయనుంది.

ఇక ఒడిశాలో వరుసగా నాలుగు టర్మ్‌లు గెలిచిన నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజూ జనతాదళ్‌ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది.ఒడిశా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మొత్తం 144 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 77 సీట్లు గెలిచింది. అధికార బీజేడీ 54 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ 19 గెలవగా అధికార బీజేడీ 9 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎంపీ స్థానాలు తోడ్పడడంతోపాటు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు..
ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గోవా, అసోం, త్రిపుర, మణిపూర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌.

కూటమిగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు..
బీజేపీ మద్దతుతో లేదా ఇతర పార్టీల మద్దతుతో కూటమిగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, బిహార్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌.
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలు..
తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌. జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో అధికారంలో  డీఎంకేకు మిత్రపక్షంగా ఉంది.
కాంగ్రెస్, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు..
మిజోరం(జెడ్పీఎం), పంజాబ్‌(ఆప్‌), కేరళ(ఎల్‌డీఎఫ్‌), సిక్కిం(ఎస్‌కేఎం), పశ్చిమబెంగాల్‌(టీఎంసీ), ఢిల్లీ(ఆప్‌), జమ్మూకశ్మీర్‌(రాష్ట్రపతి పాలన)