ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఆ నాలుగు కులాలే కొంపముంచాయా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఈసారి సరికొత్త పంథాను నేతలకు రుచిచూపించాయి. క్యాస్ట్ కాదయ్యా సామీ… అందరికీ న్యాయం జరగాలన్నదే అభిమతం అన్న సూత్రాన్ని చెప్పకనే ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన పార్టీకి, అధికారాన్ని చేపట్ట బోయే పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని చెప్పకనే చెప్పాయి. కులాల కంటే తాము కోరుకున్నది మరొకటి అన్నది చాటి చెప్పాయి. అలాగే సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి ముఖ్యమని కూడా నేతలకు ఒక రూట్ ను క్లియర్ చేశాయి. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడం కాదు.. ఏం చేయగలిగారో.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన ఎలా నడపగలిగారో చెప్పడమే భవిష‌్యత్ లో అన్ని పార్టీలకు ఇది ఒక పొలిటికల్ లెస్సన్ గా చెప్పాలి. వైఎస్ జగన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటూ నినాదం చేస్తూ వెళ్లడం ఇతర కులాలకు నచ్చలేదు. తాము కట్టిన పన్నుల మొత్తాన్ని వాళ్లకు పంచి పెట్టడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న అపప్రధను జగన్ బాగానే మూటగట్టుకున్నారు.

ఏ స్థాయిలో అంటే జగన్ ఉంటే తమ కులం ఇక ఎదగలేదన్న రీతిలో జగన్ స్లోగన్ పాయిజన్ లా ఆ ఏడు కులాల్లో పనిచేసింది. తమకు, తమ బిడ్డల భవిష్యత్ బాగుపడాలంటే జగన్ ప్రభుత్వాన్ని దించడమే ముఖ్యమన్న నిర్ణయానికి వచ్చినట్లే బటన్ నొక్కి పడేశారు. అందరూ మాట్లాడుకున్నట్లే ఒకవైపు నిలిచారంటే ఆ కులాల్లో ఎంతటి అసంతృప్తి గూడు కట్టుకుని ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రధానంగా అగ్రవర్ణాలైన రెడ్డి, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, యాదవ, వడ్డెర కులాలు అధికార వైసీపీకి వ్యతిరేకంగానే పనిచేశాయి. కమ్మ కులాన్ని తొలినుంచి జగన్ బహిరంగంగానే టార్గెట్ చేస్తూ వచ్చారు. వాళ్ల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతూ వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలుచేయడంతో పాటు మద్యం దుకాణాలను ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోవడంతో ఆ సామాజికవర్గం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఎన్నికల సమయానికి అందరూ మూకుమ్మడిగా జగన్ పార్టీపై గళం విప్పారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ సామాజికవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగాల కల్పన లేకపోవడం, అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టడంతో ఈ రెండు సామాజికవర్గాలు దూరమయ్యాయని చెప్పాలి.

తమ పిల్లలకు ఉపాధి లభించకపోవడంతో ఇదే ప్రభుత్వం కొనసాగితే ఏపీలో ఉండలేమన్న నిర్ణయానికి వచ్చారు. అనేకచోట్ల వారి భూములను కూడా కొందరు దిగువ స్థాయి నేతలు కాజేసే ప్రయత్నం చేశారు. ఆ ఎఫెక్ట్ బలంగా పార్టీపై పడిందని క్షేత్రస్థాయిలో అందుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది. ఇక రెడ్డి సామాజికవర్గంలోనూ భారీగా అసంతృప్తి ఉంది. గత ఎన్నికల్లో తమ ఆస్తులను పణంగా పెట్టి పార్టీ విజయానికి కృషి చేస్తే పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు అన్నీ వేరే వారికి ఇస్తూ తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ జగన్ ఎత్తుకున్న స్లోగన్ రెడ్డి సామాజికవర్గాన్ని హర్ట్ చేసినట్లే కనపడుతుంది. అందుకే ఎక్కువ శాతం ఆ సామాజికవర్గంలో జగన్ పార్టీకి దూరమయ్యారనే చెప్పాలి. జగన్ ను తమ సొంత సామాజికవర్గం నేతగా చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇక యాదవ, వడ్డెర సామాజికవర్గాలు బీసీలలో ఉన్నప్పటికీ వారు కూడా జగన్ పార్టీ వైపు మొగ్గు చూపలేదు.

దానికి కారణం తమకు ఇతర కులాలతో కలుపుతూ తమకు న్యాయం చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం తప్ప మరేమీ లేదన్న భావనకు వచ్చారు. వడ్డెర కులాల కూడా ఉపాధి లేక అవస్థలు పడ్డారు. పనులు లేకపోవడంతో ఆ సామాజికవర్గం కూడా పూర్తిగా దూరమయింది. నిర్మాణ రంగం పూర్తిగా కుదేలుకావడంతో ఈ వర్గం కూడా జగన్ కు బిగ్ హ్యాండ్ ఇచ్చింది.