ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పార్లమెంట్ లో తగ్గిన ముస్లింల వాట

దేశంలోని అన్నిరంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం కనిపిస్తుంద. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. అయితే 2019తో పోలిస్తే ఈసారి ఎన్నికైన సభ్యుల సంఖ్య తగ్గింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య రెండు తగ్గింది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్నికైన 24 మందిలో ఒక్కరు కూడా అధికార బీజేపీ నుంచి లేరు. ఎన్డీఏ కూటమికి చెందిన ముస్లిం ఎంపీ కూడా లేరు. ఈ 24 మందిలో 21 మంది ఇండియా కూటమికి చెందినవారే. 18వ లోక్‌సభకు ఎన్నికైన 24 మంది ఎంపీల్లో అత్యధికంగా 9 మంది కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఐదురుగు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లింలు సమాజ్‌వాది పార్టీకి, ఇద్దరు ఇండియన్‌ ముస్లిం లీగ్‌కు, ఒకరు నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందినవారు ఉన్నారు.

ఏ కూటమిలో లేని ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎంపీగా గెలిచారు. మరో ఇద్దరు ముస్లింలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.18వ లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం 4.42 శతానికి తగ్గింది. 1980లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లింలు గెలిచారు. 1984లో జరిగిన ఎన్నికల్లో 45 మంది ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం ఎంపీల సంఖ్య 40కి మించలేదు. 2014లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మందికి టికెట్‌ ఇవ్వగా వీరిలో 16 మంది మాత్రమే విజయం సాధించారు. 2019లో 115 మందికి 11 ప్రధాన పార్టీలు టికెట్‌ ఇవ్వగా, అప్పడు 16 మంది విజయం సాధించారు.