పార్లమెంట్‌లో ప్రజాహితమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ ఎంపీలతో సమావేశం అయ్యారు. పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని.. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసారు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాలన్నారు. 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియదు. ఈ సారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని ఎంపీలకు ధైర్యం చెప్పారు. పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలని.. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుందన్నారు.
ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుందన్నారు. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలని సూచించారు. ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలని… రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమన్నారు. మన పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ఖచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు. ఇదివరకటి లాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని జగన్ ప్రకటించారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారని.. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని జగన్ స్పష్టం చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలనకి సూచించారు.
పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలన్నారు. పార్టీకోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందని హామీై ఇచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది. కాని, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయని ఆరోపించారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయని.. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయననారు.
టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందన్నారు. వైయస్సార్సీపీని నమ్మకుని కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయి. గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి. రానున్న రోజుల్లో ఈ 10శాతం ప్రజలే… మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి ప్రతి ఇంట్లో మన ప్రభుత్వం చేసిన మంచి ఉందన్నారు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని ఎంపీలకు భరోసా ఇచ్చారు.