బ్రిటన్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు జరిగేందకు వీలుగా ప్రధాని రిషి సునక్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్నాయి. ఇందులో ప్రస్తుత ప్రధాని రిషి సునక్‌కు ఘోర పరాభవం తప్పదని అంచనా వేస్తున్నాయి. జూలై 4న జరుగనున్న ఈ ఎన్నికల్లో రిషి సునక్ నేతృత్వంలోని అధికార కన్జ ర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని మూడు సర్వే సంస్థలు వెల్లడించాయి.తాజా సర్వేలో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 46 శాతం మద్దతు లభించగా కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతం మాత్రమే మద్దతు లభించింది. జూన్ 12 నుంచి 14వ తేదీ మధ్య ఈ సర్వేను మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సావంత సండే టెలిగ్రాఫ్ కోసం నిర్వహించింది. కొంతమేరకు ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో కజ్జర్వేటివ్, లేబర్ పార్టీలు రెండూ తమ మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి.ఇదిలా ఉండగా మే 22న రిషి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయానికి దూరమవుతందని తాము నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయని సావంత పొలిటికల్ రీసెర్చ్ డైరెక్టర్ క్రిస్ హాప్‌కిన్స్ తెలిపారు. ఈ సర్వేలో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ కేవలం 72 సీట్లకు పరిమితమవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇది 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతి స్వల్పం. లేబర్ పార్టీకి 456 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.ఇక బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వేలో ప్రధాని సునాక్ తన సీటును సైతం కాపాడుకోకోలేరని పేర్కొంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ 15,029 మంది నుంచి అభిప్రాయం సేకరించింది. దీని ఆధారంగా రూపొందించిన నివేదికలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీకి 468 సీట్లు వస్తాయని వెల్లడించింది.