ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి, వైసీపీ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించిన సలహాదారులు ఎవరు ఇప్పుడు తాడేపల్లిలో కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. లెక్కకు మిక్కిలిగా తిష్ట వేసిన సలహాదారులు ఐదేళ్లలో ప్రభుత్వానికి ఏమి సలహాలు ఇచ్చారో ఎవరికి తెలీదు కానీ వైసీపీ పరాజయం పాలైన వెంటనే పత్తా లేకుండా పోయారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా సొంత వారికి పెద్ద ఎత్తున సలహాదారుల పోస్టుల్ని వైసీపీ కట్టబెట్టింది. వారిలో చాలామంది నామమాత్రంగా సర్దుకుపోయినా నలుగురైదుగురు మాత్రం బాగా పెత్తనం చెలాయించారు.ప్రజా ప్రతనిధులు మొదలుకుని, మంత్రుల వరకు అంతా తమ చెప్పు చేతల్లో ఉండేలా సాగించుకున్నారు. మంత్రులు, సీనియర్ పొలిటిషియన్లైనా తాము చెప్పిందే చేయాలని, గీటు దాటితే అధినేత పేరుతో బెదిరింపులకు పాల్పడే వారు.
ప్రెస్ మీట్‌లో తాము రాసిచ్చిన దానికంటే ఒక్క లైన్ కూడా అదనంగా మాట్లాడ్డానికి వీల్లేదని హుకుం జారీ చేసేవారు. ఎవరైనా స్వతంత్రంగా మాట్లాడారంటే వారి మీద లేనిపోనివి నూరిపోయడం పరిపాటిగా ఉండేది.ఇక ఐదేళ్లలో రెండు విడతల్లో దాదాపు 50మంది మంత్రి పదవుల్లో ఉన్నా వారిలో ఒక్కరి పేరును జనం గుర్తుంచుకోలేక పోవడానికి సుప్రీం మినిస్టర్ కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఏ మంత్రి ఏమి చేయాలన్న, ఏ శాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సదరు సలహాదారుడికే బాధ్యత అప్పగించేవారు. ఫక్తు ప్రాంతీయ పార్టీగా వైసీపీని నడిపించి బొక్కబొర్లా పడ్డానికి సదరు సలహాదారుడే కారణమనే విమర‌్శలు ఉన్నాయి.అధికారంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన వారు, సాధారణ కార్యకర్తలు, అభిమానుల్ని పూర్తిగా దూరం చేసేసి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మాత్రమే పరిమితం చేయడంలో కొందరు సలహాదారుల పాత్ర ఉంది.
కాగితాలపై రాసిచ్చిన వాటిని మాత్రమే చదవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పరిమితం చేయగలిగారు. ఐదేళ్లలో మీడియాతో మాట్లాడకుండా, ప్రశ్నించే అవకాశమే ఎవరికి దక్కనివ్వకుండా చేయడంలో ఇలాంటి సలహాదారులే ప్రధాన పాత్ర పోషించారు.ఇక క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియనివ్వకుండా అంతా బాగుందనే నివేదికలతో మరికొందరు నిండా ముంచినట్టు తాడేపల్లిలో ప్రచారం జరుగుతోంది. సర్వేలు, నివేదికల పేరిట కోట్లు కూడబెట్టకోవడం వెనుక కూడా కొందరు సలహాదారుల ప్రమేయం ఉంది.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఠాలుగా జట్టుకట్టి జగన్‌ను నిండా ముంచేశారనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా వీరు పనిచేశారనే విమర‌్శలు ఉన్నాయి. అధికార పార్టీ తరపున గత ఏడాదిన్నర కాలంలో సాగిన ప్రచారంలో కూడా సిఎంఓలో పనిచేసిన వ్యక్తులే బినామీ పేర్లతో సొమ్ము కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.ఏ రాష్ట్రంలో లేనంత పేలవమైన పబ్లిసిటీ, పిఆర్ వ్యవస్థను నడిపిన సిఎంఓగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోయింది. ఐదేళ్లలో రెండు మూడు తప్ప ప్రెస్ మీట్‌లు కూడా నిర్వహించలేని స్థితికి జగన్‌ను నెట్టేయడంలో అధికారులు, జగన్ నమ్ముకున్న వారు కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సలహాదారుల్లో పలువురు ఇళ్లు కూడా ఖాళీ చేసి తాడేపల్లి నుంచి మాయం అయిపోయారు.ఇలా ఐదేళ్లుగా అందర్నీ దూరం చేసిన వారిలో చాలామంది అధికారం పోగానే కాగానే తాడేపల్లి నుంచి బిచాణా ఎత్తేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బీరాలు పలికిన వారు కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకుండా పోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారంలో వస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెబుతున్నా, పార్టీ కోసం నిలబడేలా ఎందరిని మిగుల్చుకున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.