ఆంధ్రప్రదేశ్‌లో కొత్త దందా వెలుగు చూసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల దందాకు తెర తీసింది. వేల సంఖ్యలో ఉద్యోగుల్ని జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో నియామకాలు చేపట్టారు. అయితే వీటిలో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక విచారణలో పలు ప్రభుత్వ విభాగాల్లో నకిలీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించినట్టు గుర్తించారు.ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో రూ.40వేలకు మించి వేతనాలు అందుకుంటున్న వారిని తొలగించాలని అధికారికంగా ఆదేశించారు 2014-19 మధ్య కాలంలో నియమితులైన ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని వారిని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత కావాల్సిన చోట తమ వారిని నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో విధివిధానాలు లేకపోవడంతో ఇలా జరిగింది.
ఏపీలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఉద్యోగాల భర్తీలో నియమనిబంధనలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అనుసరించాల్సిన విధి విధానాలు ఏవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అమలు చేయలేదు. రూల్ ఆఫ రిజర్వేషన్, ప్రతిభ ద్వారా ఎంపికల ఊసే లేదు. కేవలం సిఫార్సులు, పైరవీలు, పైసలతో ఉద్యోగాలను దక్కించుకునే పరిస్థితులు చాలాకాలంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ వారిని నియమించుకోడానికి కొత్త మార్గాలను అన్వేషించారు. అప్కాస్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. అన్ని ప్రభుత్వ విభాగాలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాల తరహాలోనే బహిరంగంగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష, ప్రతిభ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది.
గత ఐదేళ్లలో ఒకటి రెండు శాఖలు మాత్రమే ఈ తరహాలో ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలవడంతో గత ప్రభుత్వ నియామకాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు వెలుగు చూస్తున్నాయి. అసలు పనిచేయని వారికి కూడా ఐదేళ్లుగా వేతనాలు చెల్లించినట్టు గుర్తించారు. వైసీపీ తరపున సోషల్ మీడియాలో పనిచేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా వేర్వేరు విభాగాల నుంచి జీతాలు చెల్లించారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలకు కూడా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి జీతాలు చెల్లించారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, జిల్లాల్లో వైసీపీ నాయకుల తరపున ప్రచారం నిర్వహించే కార్యకర్తలు, అభిమానుల్ని ప్రభుత్వ ఉద్యోగుల జాబితాల్లో చేర్చేశారు. వీరికి వేలల్లో జీతాలు చెల్లించినట్టు కొత్త ప్రభుత్వం గుర్తించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఇలాంటి వందలాది ఉద్యోగుల్ని గుర్తించారు. వీరిలో చాలామంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీడీసీ, ఈ ప్రగతి, ఆర్టీజీఎస్, స్పందన కాల్ సెంటర్లలో వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించారు. ఇలా ఒకటో రెండో కాదు వందలాది మంది నకిలీ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించారు. ఈ శాఖలతో సంబంధం లేని వారు, వైసీపీ తరపున సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేసిన వారు, వారి కుటుంబ సభ్యులకు ఈ ఖాతాల నుంచి చెల్లింపులు జరిపారు. యూ ట్యూబర్లు, మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఈ జాబితాలలో ఉన్నారు.కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లో ఉన్న అసలు సిబ్బందికంటే రెట్టింపు సంఖ్యలో వీరు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీ తనం పెంచడానికి ముఖ గుర్తింపు ఆధారిత అటెండెన్స్ అమల్లోకి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం వీరందరికి అటెండెన్స్ లేకపోయినా ప్రతినెల టంచనుగా జీతాలు ఇచ్చేసింది. వీరిలో చాలామంది అధికార పార్టీ తరపున సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే ధ్యేయంగా పని చేశారు.
ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారికి ప్రభుత్వం నుంచి జీతాలను చెల్లించారని భావిస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికై రోజూ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేసిన వాళ్లు కూడా కొత్త ప్రభుత్వం రాకతో బిక్కుబిక్కు మంటున్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా భయంతో గడపాల్సి వస్తోందని చెబుతున్నారు.ప్రభుత్వం, ఆర్ధిక శాఖ అనుమతించిన పోస్టుల కంటే అదనంగా కొత్త వారిని చేర్చుకుని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నకిలీ ఉద్యోగుల దందాకు సూత్రధారులు, పాత్రధారులను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న వారు, గృహిణులు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇలా అప్పనంగా ప్రజల సొమ్మును చెల్లించడంపై కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.