తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇవ్వనుందా..? మద్యం ధరలను పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఓ పక్క రాష్ట్రంలో కావాల్సిన బ్రాండ్ల మద్యం, బీర్లు దొరకడం లేదని మందుబాబులు ఆందోళన చెందుతుంటే మరో పక్క మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో మధ్యం ధరలు పెరుగుతూ ఉంటాయి. రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో మద్యం ధరలను పెంచింది. ఇప్పడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం.అన్ని బ్రాండ్ల లిక్కర్ ధరల మీద 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.
బీర్ల పైన రూ.10 నుంచి రూ.15 మేరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. ధరలను పెంచినట్లయితే.. ఏటా ప్రభుత్వానికి మూడు నుంచి మూడున్నర వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే ధరలను పెంచాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.35వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు ధరలను పెంచితే ఏటా దాదాపు రూ.40వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వినియోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.