ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తై రెండేళ్లు దాటుతున్న రాష్ట్రపతి అమోద ముద్ర మాత్రం లభించలేదు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజక వర్గాల ప్రతిపాదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. స్థానికుల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో ఏక పక్షంగా జిల్లాల సరిహద్దులు నిర్ణయించేశారు. కేవలం అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే అప్పట్లో ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన విజయ్‌కుమార్ జిల్లాల పునర్విభజన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈసెట్ అడ్మిషన్ల నేపథ్యంలో కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని ఐదు మండలాలు విశాఖపట్నం ఏయూ పరిధిలోనే ఉంటాయని ఈసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఏపీలో జిల్లాల పునర్విభజనకు ఇప్పటికీ రాష్ట్రపతి అమోద ముద్ర లభించకపోవడంతో ఉమ్మడి జిల్లాల పరిధిలోనే స్థానికత వర్తింప చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గాన్ని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కలిపారు. కందుకూరు నియోజక వర్గంలోని గుడ్లూరు, లింగ సముద్రం, కందుకూరు, ఉలవపాడు, ఒలేటివారి పాలెం, కందుకూరు మునిసిపాలిటీల పరిధిలో ఉన్న విద్యార్ధులు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోనే స్థానికత పొందుతారు. జిల్లాల విభజన తర్వాత వారు ఎస్వీ యూనివర్శిటీ పరిధిలోకి వెళ్లినా రాష్ట్రపతి అమోదం లభించపోవడంతో 2022 ఆగష్టు2న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే 2024-25 ఈసెట్ అడ్మిషన్లలో స్థానికత అమలు చేయనున్నారు.ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు డిప్లొమా నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదువుకుంటే అక్కడ స్థానికత వర్తిస్తుందని ఈసెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. గుడ్లూరు, లింగసముద్రం,కందుకూరు, ఉలవపాడు, ఒలేటివారి పాలెం, కందుకూరు మునిసిపాలిటీలకు చెందిన విద్యార్ధులు ప్రస్తుతం ఎస్వీయూ పరిధిలోని నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటున్నా, ఈ ఏడాది ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఈసెట్ 2024 అడ్మిషన్లలో పాల్గొంటున్న విద్యార్ధులు ఈ మార్పును గుర్తించాలని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆటో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు, హెల్ప్ లైన్ సెంటర్లలో వెరిఫికేషన్ చేసుకున్న వారు ఏ యూనివర్శిటీ పరిధిలో ఉన్నారో పత్రాలను తనిఖీ చేసుకోవాలని ఈసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఎస్వీయూ నుంచి ఏయూకు మార్చుకోవాల్సిన విద్యార్ధులు స్థానికంగా ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్లలో లోకల్ ఏరియా మార్చుకోవాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ల నమోదుకు ముందే లోకల్ ఏరియా మార్చుకోవాలని ఆ తర్వాత అనుమతించరని స్పష్టం చేశారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరిగి రెండేళ్లు దాటినా ఇప్పటికి రాష్ట్రపతి అమోదం ఎందుకు లభించలేదనేది ఆస్తకికరంగా మారింది. తాజాగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.