ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

బైక్‌లు నడిపే వారందరూ హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి

బైక్‌లు నడిపే వారందరూ హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి అని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్‌ ధరించకుండా పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ఈ ప్రమాదాల్లో మరణాలకు చాలావరకు హెల్మెట్‌ ధరించకపోవడమే కారణమని పేర్కొంటూ న్యాయవాది యోగేశ్‌ ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ వేశారు. ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. యోగేశ్‌ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా ద్విచక్రవాహనాలు నడిపే అందరూ హెల్మెట్‌ పెట్టుకోవాల్సిందేనని పిటిషనర్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోతే కేసులు నమోదు చేయవచ్చని పోలీసులకు సూచించారు.

హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. అలాగే మోటార్‌ వాహనాల చట్ట నిబంధనలు తెలియజేస్తూ అధిక సర్క్యులేషన్‌ గల ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. వాహనాల తనిఖీలకు సంబంధించి కూడా ఏపీ పోలీసులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. వాహనాలను తనిఖీ చేసే సమయంలో పోలీసులు కచ్చితంగా బాడీ కెమెరాలు ధరించాలని సూచించింది.