ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్ రావు శుక్రవారం ములాఖత్ అయ్యారు. ఈ ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. బెయిల్ పిటిషన్లపై విచారణతో పాటు కుటుంబానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితను కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఇటీవల కోర్టు మరోసారి పొడిగించింది. జులై 5వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. మొదట ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ కేసులో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తంగా రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో.. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. మరోవైపు.. కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని కూడా ఈడీ పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం చేశారో ఈడి, సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడం తో పాటు, సాక్ష్యాలను జరిపి వేసే ప్రయత్నం చేశారని అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు వివరించారు. కవితకు ఈ డి సమన్లు జారీ చేసిన రెండు రోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు.కవిత సాధారణ మహిళ కాదని పేర్కొన్న ఈడి రాజకీయ శక్తిసామర్ధ్యాలు ఉన్న వ్యక్తని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురని పేర్కొన్నారు. విదేశాలలో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి, రాజకీయాలలో ఉన్నత స్థానాలను చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కేసులో బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై లను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని ఈడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది.