ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం  గుడ్ న్యూస్ చెప్పింది. 2024 సాధారణ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల అదనపు వేతనం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సీఈవో శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు, రాజధాని అమరావతి పరిధిలో పని చేస్తోన్న ఉద్యోగులకు సైతం ఇప్పటికే శుభవార్త అందించింది. వారికి 5 రోజుల పని దినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో పాటు, వివిధ హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆ ఉద్యోగులు పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల 5 రోజుల పని దినాల గడువు గురువారంతో ముగియగా మరో ఏడాది పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
విభజన తర్వాత..
ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం కొన్ని సదుపాయాలు కల్పించారు. సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి 5 రోజుల పని విధానం అమలు చేశారు. అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకూ ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు భావించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని ఎత్తేయాలని ఆలోచన చేసింది. అయితే, ఉద్యోగుల విజ్ఞప్తితో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ గడువు ముగుస్తుండడంతో తాజాగా సీఎం చంద్రబాబు మళ్లీ 5 రోజుల పని దినాల గడువు పొడిగించారు.