ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పెన్షనర్లు కు బాబు లేఖ

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు పింఛన్ దారులకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ‘ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పింఛన్ ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచి ఇంటి వద్దే పెన్షన్ అందిస్తాం. పింఛన్ల విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. వడగాలులు, మండుటెండల మధ్యలో ఎంతో మంది పింఛన్ దారులు పెన్షన్ సకాలంలో అందక ఎన్నో అగచాట్లు పడ్డారు. ఆ ఇబ్బందులను చూసి ఏప్రిల్ నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాట ఇచ్చాను. పింఛన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మొత్తం పింఛన్ జులైలో మీకు అందిస్తున్నాం.’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాల్లో రెండో సంతకం పెన్షన్ల పెంపుపైనే చేశారు. ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు ఇతర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్ము రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మొత్తం 3 నెలలకు సంబంధించి ఎరియర్లతో కలిపి జులైలో ఒకేసారి రూ.7 వేలు అందించనున్నారు. అలాగే, రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల – రూ.6 వేలు, మూడో కేటగిరీకి సంబంధించి పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల – రూ.15 వేలు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన పింఛన్ సొమ్ము అందించనున్నారు. జులై 1 ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందిస్తారు. ఈ మేరకు ఒక్కో ఉద్యోగి 50 మందికి పెన్షన్లు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ నీరభ్ కుమార్ ఇప్పటికే ఆదేశించారు.

వీలైనంత వేగంగా ఒకే రోజులో పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని.. అవసరమైతే మంగళవారం కూడా పంపిణీ చేపట్టాలని నిర్దేశించారు.రాష్ట్రంలో పెరిగిన పింఛన్ల మేరకు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,399.89 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 64.75 లక్షల మందికి ఇంటి వద్ద రూ.4,369.82 కోట్లు ఇంటి వద్ద అందించనుండగా.. మిగిలిన 43 వేల మంది బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు రూ.30.05 కోట్లను నేరుగా వారి అకౌంట్లలోకి జమ చేస్తారు.