ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగన్ నెత్తిన పాలు పోసిన నితీష్

వైఎస్ జగన్ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఆయన బెంగళూరులోని తన ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఓటమిని పక్కన పెట్టి పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. మామూలుగా అయితే కార్యకర్తలను పరామర్శించడం పేరుతో ఆయన యాత్ర కూడాచేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు పదకొండు స్థానాలు మాత్రమే వచ్చినా నలభై శాతం ఓట్లు రావడంతో ప్రజలు ఎక్కువ శాతం మంది తన వైపు చూశారని చెప్పుకోవడానికి వీలు కలిగింది. మూడు పార్టీలు కలిస్తే 56 శాతం ఓట్లు వస్తే, ఒంటరిగా పోటీ చేసి నలభై శాతం ఓట్లు తెచ్చుకోవడం ఆషామాషీ కాదని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రారంభించారు. అయితే తాజాగా జరుగుతున్న ఘటనలు జగన్ కు అందివచ్చేటట్లే కనిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పెట్టిన ఫిట్టింగ్ ఇప్పుడు జగన్ కు లాభం చేకూర్చేలా మారింది. బీహార్ అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ తీర్మానం చేశారు.

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ తీర్మానం చేసింది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చేలా డిమాండ్ చేయాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది. కాగా, జేడీయూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ సాధనకు కృషి చేయాలని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇటు జేడీయూ, అటు టీడీపీ మద్దతు కీలకం. జగన్ చెప్పింది కూడా అదే. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లిన జగన్ తాము శాసించే స్థాయిలో బీజేపీకి సీట్లు వచ్చినప్పుడే ప్రత్యేక హోదా సాధ్యమని చెప్పారు. 2019 లో బీజేపీకి సొంత బలం ఉండటంతో అది సాధ్యం కాదని నాడే కుండబద్దలు కొట్టారు. అయితే ఇప్పుడు శాసించే స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకు రావడానికి ఎందుకు ప్రయత్నం చేయరని జగన్ జనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మద్దతు ఉపసంహరించాలని, తాము కూడా మద్దతు ఇవ్వమని చెబుతామని, అప్పుడు ప్రత్యేక హోదా వస్తుందని మెలిక పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వీలయినంత త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది నిజంగా ఇరకాటంలోకి నెట్టేదే. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అందరూ అంగీకరిస్తారు. చంద్రబాబు కూడా2019 ఎన్నికలకు ముందు ధర్మపోరాటం పేరుతో ఇదే రకమైన డిమాండ్ తో దీక్షలు చేశారు. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జగన్ కు ఒక ఊత మిచ్చినట్లయింది. బీహార్ కోరితే మనమెందుకు అడగమంటూ జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందుకోసం రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

చంద్రబాబు మాత్రం ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థికపరిస్థితి, చేసిన వాగ్దానాల అమలుతో వాటిని సుసాధ్యంచేయడానికి నిధులు తెచ్చుకోవడం, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే ఫోకస్ పెట్టారు. మరి ఇవన్నీ వదిలేసి చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తారని భావించలేం. దీంతో జనంలోకి వెళ్లడానికి జగన్ కు మంచి పాయింట్ అయితే దొరికింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.