ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది. పెంచిన పింఛన్ల సొమ్ముతోపాటు మూడు నెలల బకాయిలు కలిపి ఇవ్వడంతో 60 లక్షల మందికి పైగా పింఛన్‌దారులు ఆనందోత్సాహాల్లో మునిగితేలగా…అటు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన పింఛన్‌దారులు సైతం సంతోషంలో మునిగితేలారు. చాలారోజుల తర్వాత 1వ తారీఖు జీతాలు పడ్డాయోచ్ అంటూ సంబరపడ్డారు. ఏపీలో ఉద్యోగులు పింఛన్‌దారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటో తారీఖు వారి ఖాతాల్లో జీతాలుపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి…జీతాలుపడితే సంబరాలు చేసుకోవడం ఏంటి? పనిచేసిన తర్వాత ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థ అయినా జీతాలు ఇస్తుంది కదా..ఇందులో సంబరపడాల్సిన పని ఏముంది అనుకుంటున్నారా..? పైగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిడుగులుపడినా నెలఖారు కల్లా వారి జీతం వారికి వస్తుందన్న నానుడి కూడా ఉంది ఇదా..ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.?
అక్కడే ఉంది మరి అసలు కిటుకు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలు ధర్నాలు, సమ్మెలతో పాలక ప్రభుత్వాన్ని గడగడలాడించేవాళ్లు. పెన్‌డౌన్, పెన్‌డ్రైవ్ డౌన్ అంటూ ఉద్యమాన్ని ఉరకలెత్తించేవాళ్లు. ఉద్యోగులు రోడ్డెక్కారంటే పాలక గుండెల్లో రైళ్లు పరుగులెత్తేవి. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా వారి యూనిటీ..బలమైన ఉద్యోగసంఘాలకు తోడు..ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండేది వాళ్లే కాబట్టి ఐదేళ్ల తర్వాత తమ పార్టీకి ఎక్కడ ఎసరు తెస్తారోనన్న భయం ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అటు జగన్మోహన్‌రెడ్డిగానీ, ఇటు కేసీఆర్గానీ ఉద్యోగ సంఘాల కోరలు పీకేశారు. ఉద్యోగులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. జీతాలు పెంచమని అడిగే ధైర్యం కాదు కాద…నెలనెల జీతాలు ఇస్తే చాలురా దేవుడా అన్నంత పని చేశారు.ఉద్యోగులు బకాయిలు, డీఏలు, ఫిట్‌మెంట్ దేనిపైనా ఉద్యోగులు నోరెత్తే సాహసం చేయలేదు. ప్రతినెల మొదటి తారీఖు రావాల్సిన జీతం కూడా దాదాపు 20వ తారీఖు తర్వాత వచ్చిన సందర్భాలు ఎక్కువే.
ప్రభుత్వం ఎప్పుడు జీతం ఇస్తే అప్పుడు తీసుకోవాల్సిందేనన్న పరిస్థితులు కల్పించారు. ఒక్కోసారి రెండోనెలలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈఎంఐలు కట్టాలని వేడుకున్నా…పాలబిల్లు, సరకులు తెచ్చుకోవాలని ప్రాథేయపడినా వైసీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పెద్దపెద్ద జీతాలు వచ్చేవారి సంగతి సరే…కానీ కేవలం నెలజీతం మీదే ఆధారపడే బ్రతికే చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు కోసం తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పడరానివారితో మాటలు పడ్డారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వంగా చెప్పుకునే వారు కూడా కిరాణా దుకాణదారుడితోనూ, పాలు, కూరగాయలు అమ్మే వారితోనూ మాటలు పడాల్సి వచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ ఉద్యోగుల బతుకుల్లోనూ మార్పులొచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో జూన్ 1నే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాల్లో వేశారు. ముఖ్యంగా పదవీవిరమణ పొందిన పింఛన్‌దారుల ఆనందానికి అవధుల్లేవ్..ఇంటి ఖర్చులకు, మందులకు ఇవే వారికి ఆధారం.
దాదాపు అందరి ఖాతాల్లో వేతనాలు జమ అయ్యాయి. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మొదటి తారీఖు జీతాలు పడటంతో వేతనజీవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో గాడితప్పిన వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబ..ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్య పరిష్కరించారు. సామాజిక పింఛన్‌దారులకు నాలుగున్నరవేల కోట్లు…ఉద్యోగుల జీతాలకు ఐదున్నరవేల కోట్ల రూపాయలను ఒకేరోజు ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రభుత్వం వచ్చిన పక్షం రోజుల్లోనే దాదాపు పదివేలకోట్ల రూపాయలు అందజేసింది.