ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ ఆఫీసుపై దాడి

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 2021 అక్టోబరు 19న టిడిపి కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసిపి శ్రేణులు దాడికి దిగాయి. అప్పట్లో పోలీసులు కేసులు పెట్టలేదు. నిందితుల్ని అరెస్టు చేయలేదు. టీడీపీ నేత పట్టాభిరాం ఓ ప్రెస్ మీట్‌లో జగన్  ను దూషించారని ఆరోపిస్తూ..  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ అనుచరులు దాడి చేశారన్న ఆరోపణలుఉన్నాయి. వీరి దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో దొరికాయి.  ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.  టీడీపీ ఆఫీస్తో పాటు  పట్టాభిరామ్‌ ఇంటిపైనా అల్లరిమూకలు దాడి చేశాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారరు.  

ఎన్నడూలేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ప్రణాళిక ప్రకారం జరిగిన దాడులు తీవ్ర విస్మయానికి గురిచేశాయి. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సీఎం జగన్ కూడా స్పందించారు. తనను ఇష్టం వచ్చిన ట్లుగా తిట్టారని తన అభిమానస్తులకు బీపీ వచ్చి ఇలా చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా వ్యాఖ్యానించడంతో పోలీసులు కూడా ఎవరూ కేసులు పెట్టలేడీజీపీ కార్యాలయం పక్కనే టీడీపీ ఆఫీసు ఉంటుంది. అటు గుంటూరు నుంచి ఇటు విజయవాడ నుంచి ఒకే సారి అల్లరి మూకలు వచ్చి టీడీపీ ఆఫీసుపై దాడి  చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడులన్నీ పూర్తయిన తర్వాతనే పోలీసులు వచ్చారు. విధ్వంసం సృష్టిస్తున్నారని ఓ వ్యక్తిని టీడీపీ నేతలు పట్టుకుంటే అతను పోలీసు అధికారి అని తేలింది. అయనను నిర్బంధంలో తీసుకున్నందున టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు పోలీసులు. అయితే ప్రభుత్వం మారడంతో సీన్ మారిపోయింది.

గత రెండు రోజులుగా.. టీడీపీ ఆఫీసులో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి దాడిలో పాల్గొన్న నిందితుల్ని గుర్తించి.. కేసులు పెట్టడం ప్రారంభించారు.  దాదాపుగా నూట యాభై మందిపై కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. కొంత మందిపై కేసులు పెట్టిన విషయం తెలియగానే ఆజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. దొరికిన ఐదుగుర్ని అరెస్టు చేశారు. అసలు వారిని ఎవరు దాడులకు ప్రోత్సహించారన్నదానిపై విచారణ చేసి సూత్రధారుల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలి పెట్టే ప్రశ్నే లేదని.. సీసీ ఫుటేజీతో పాటు.. ఫోన్ కాల్ రికార్డులతో సహా మొత్తం తీసి న్యాయస్థానంలో పెట్టి చట్టబద్ధంగా శిక్షిస్తామని టీడీపీ నేతలంటున్నారు.