తెలంగాణ రాజకీయం

అశోక్ నగర్ లో నిరసనలు, పరీక్షల వాయిదాపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణలో  డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. 

పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న నిరసనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు మంత్రులను కలిసి వారి సమస్యలు చెప్పాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-2, 3, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తున్నారు. శనివారం రాత్రి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

నిరుద్యోగులకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగ ఆశావహుల ఆవేదనను అర్థం చేసుకుని పరీక్షల రీషెడ్యూల్, పోస్టుల పెంపు, ఉద్యోగాల క్యాలెండర్‌కు సంబంధించిన సమస్యలకు పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించకుండా నిరుద్యోగ యువతతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చర్చలు జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తప్పుడు హామీలు, పేపర్‌ లీకేజీల వల్ల తెలంగాణ యువత నిర్లక్ష్యానికి గురైందన్నారు. 

గ్రూప్‌-2, 3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనల నేపథ్యంలో అశోక్ నగర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి మెరుపు ఆందోళనకు పిలుపునివ్వడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  దీంతో ఆదివారం ఉదయం నుంచి చిక్కడపల్లిలోని లైబ్రరీ పరిసరాల్లో మఫ్టీలో పోలీసులు తిరుగుతున్నారు. పోలీస్ వాహనాలతో పహారా ఏర్పాటు చేశారు.  అశోక్ నగర్ లో నిఘా పెంచారు.