తెలంగాణ

15 తర్వాత లిక్కర్ రేట్లు పెంపు

నల్గోండ, జూలై 27: ఈ దేశంలో మందు బాబులకు మించిన దేశభక్తులు ఉన్నారా అని ఓ సినిమాలో ఓ పాత్ర అడుగుతుంది. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం మందు బాబులే అని అర్థం వచ్చేలా అతని స్పీచ్ ఉంటుంది. వినడానికి అతిశయోక్తి గా అనిపించినా..ప్రస్తుత ప్రభుత్వాలకు మందు బాబులే ఆదాయ మార్గాలుగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హామీలు నెరవేర్చాలంటే తప్పనిసరిగా ఆదాయం పెంచుకోవాలి. ఇప్పటికిప్పుడు ధరలు పెంచినా జనం నుంచి తీవ్ర ఆగ్రహం వస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందంటే అది లిక్కర్ రేట్లు పెంచడం ఒక్కటే మార్గం. తెలంగాణ సర్కార్ ఇప్పుడు అదే దిశగా ఆలోచిస్తోంది. ఆగస్టు 15 తర్వాత లిక్కర్ రేట్లు రెట్టింపు చేసి ఆదాయాన్ని భారీగా సమకూర్చుకోవాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది.ఈ సంవత్సరం లిక్కర్ అమ్మకాల ద్వారా రూ.40 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.36,493 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వరుస ఎన్నికలు ఉండటంతో మద్యం అమ్మకాలకు కలిసొచ్చింది. ఎన్నికలలో మద్యం ఏరులై పారింది. రాజకీయ నాయకులు డబ్బుకు లెక్క చేయక అటు కార్యకర్తలు, ఇటు ఓటర్లకు మద్యం వాళ్ల సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఉచితంగా అందించడంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి.అయితే ఈ ఏడాది కూడా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు బాగానే ఉంటాయని అంచనాలు ఉన్నాయి. కల్తీ మద్యం పైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చీప్ లిక్కర్ ను అదుపుచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. మద్యం ధరలు 20 శాతం పెంచితే బాగుంటుందని భావిస్తోంది ప్రభుత్వం.