పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నామన్నారు.
ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని వెల్లడించారు. లే ఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని, అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి హితవు పలికారు.