ఆంధ్రప్రదేశ్

 విశాఖ ఉక్కు మరో రికార్డు..

విశాఖపట్టణం, జూలై 29: శాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. 1990 నవంబరులో ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించగా.. నేటి వరకూ 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మైలు రాయిని అధిగమించినట్లు విశాఖ ఉక్కు యాజమాన్యం శనివారం ప్రకటించింది. కర్మాగారం 100 మిలియన్ టన్నుల రికార్డు సాధించడం పట్ల కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. ముడిసరుకు కొరత కారణంగా 2, 3 బ్లాక్ ఫర్నేస్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. ఇటీవలే విశాఖ ఉక్కు పరిశ్రమలోని అన్ని విభాగాలను కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ సొంతం కాగా.. 100 శాతం వాటాలు ఆ సంస్థకే ఉన్నాయి. 1970లో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అప్పటి ప్రధాని ఇందిర ప్రకటన చేసి భూములు సేకరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తర్వాత ఉత్పత్తి ప్రారంభమై ఎన్నో రికార్డులు అధిగమించింది. ఎంతో మంది ఉక్కు పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే, ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ వాటాలు అమ్మేసి ప్రైవేటుకు అప్పగిస్తామని గతంలో కేంద్రం ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచీ దాదాపు మూడున్నరేళ్లకు పైగా ఉక్కు కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. అనంతరం కేంద్ర పెద్దలు సైతం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రైవేటీకరణ ద్వారా ప్లాంట్ మెరుగుపడుతుందని.. ఉద్యోగుల భవిష్యత్ బాగుంటుందని అప్పట్లో వారి వాదనగా ఉండేది.అయితే, ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వెనుకడుగు పడింది. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ విజిటింగ్ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే అవకాశం లేదని.. ఆందోళన వద్దని స్పష్టత ఇచ్చారు. పరిశ్రమలో సమస్యలను ప్రధానికి వివరించే పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు