అమరావతి: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేసారు. దాంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు సజీవం కానుంది. శ్రీశైలం నుంచి నేరుగా వరద జలాలు సాగర్ ప్రాజెక్టును చేరనున్నాయి. కృష్ణా బేసిన్ లో వరదలు కొనసాగుతోన్నాయి. కర్ణాటక నుంచి జూరాలకు భారీగా వరద వస్తోంది. దీంతో అంతే స్థాయిలో నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద ప్రవహిస్తోంది. శనివారం జూరాల నుంచి 3,12,544 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కులు మొత్తం 4,12,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
సాయంత్రం 6 గంటల సమయానికి 2,97,886 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.40 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీంఎంసీలు కాగా, ప్రస్తుతం 127.5950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతున్నాయి. తుంగభద్ర డ్యాం గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగులకుగాను ప్రస్తుతం 1,631.68 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 100.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం 33 గేట్లు ఎత్తి దిగువకు 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలోకి రోజుకు సగటున 30 టీఎంసీల వరద వచ్చి చేరుతోంది. వరద ఇలాగే కొనసాగితే మంగళవారం శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు.
నాగార్జునసాగర్ నీటి సమాచారం :
నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం :590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 510.20 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ. 312.5050 టి.ఎం.సిలు. ప్రస్తుత నీటి నిల్వ :132. 0098 టి.ఎం.సి.
కుడి కాలువ. :6,041.క్యూసెక్కులు, ఎడమ కాలువ. :నిల్
మెయిన్ పవర్ హౌస్ :నిల్, ఎస్. ఎల్. బి .సి. 400 క్యూసెక్కులు.క్రస్ట్ గేట్స్. నిల్. ఇన్ ఫ్లో.53,774.క్యూసెక్కులు ఔట్ ఫ్లో. 6,441.క్యూసెక్కులు ఉంది