అమెరికాలో పెరుగుతోన్న డెల్టా కేసులు
అమెరికాలో కొన్నినెలల క్రితం కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండడంతో మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధనను ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజులుగా అమెరికాను కరోనా డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. దీంతో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకోవాల్సిందేనని అమెరికా ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, వ్యాక్సిన్ మీద భయంతో చాలా మంది దాన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. దీంతో వ్యాక్సినేషన్ పట్ల శ్రద్ధ చూపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. టీకాలు ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని అమెరికా అంటువ్యాధుల నిపుణులు చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు అధికమవుతున్నాయని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు.