తెలంగాణ

5.30 గంటలకే మెట్రో

హైదరాబాద్, జూలై 30: దరాబాద్ మెట్రో మరో ఫెసిలిటీ తీసుకొస్తోంది. ఉదయం ఐదున్నర గంటలకే తొలి ట్రైన్ నడపాలని నిర్ణయించారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉండే వాళ్లకు మెట్రో ట్రైన్ వరంలా మారింది. ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లాలంటే గంటల కొద్ది సమయం వృథా అయ్యాది. అదే మెట్రో వచ్చాక ఆ సమయం గంటకు తగ్గిపోయింది. ఉదయం ఆరు గంటలకు ప్రతి కారిడార్‌ నుంచి తొలి ట్రైన్ బయల్దేరుతుంది. ఇకపై దాన్ని మరింత ముందుకు తీసుకొచ్చింది మెట్రో యాజమాన్యం. ప్రతి రోజు ఉదయం 5.30కి ఇకపై మొదటి మెట్రో బయల్దేరనుంది. ఇప్పటికే దీనిపై ట్రయల్‌రన్ నిర్వహించిన అధికారులు ప్రతి రోజూ నడపాలని నిర్ణయించారు. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న వేళ మెట్రో యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారాల్లో నిర్వహించిన ట్రయల్ రన్‌కు మంచి స్పందన రావడంతో ఇకపై రోజూ ఐదున్నరకే నడపాలని నిర్ణయించారు. ఐటీ, మీడియాకు చెందిన వారంతా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. వారందరూ వేర్వేరు రవాణా మార్గాల్లో ఆఫీసులకు చేరుకుంటున్నారు. వర్షాల సమయంలో వీళ్లంతా ఇబ్బంది పడుతున్నారు. వారితోపాటు వేర్వేరు ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చే ప్రయాణికుల కోసం కూడా ఉదయం ఐదున్నరకే ట్రైన్స్ నడపాలని నిర్ణయించామన్నారు అధికారులు. ఉదయం ఐదున్నర నుంచి మెట్రో నడపాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని అధికారులు చెప్పారు. అయితే అందుకు తగ్గ రద్దీ ఉంటుందా లేదా అనేది అనుమానంగా ఉండేదని తెలిపారు. అయితే ప్రతి శుక్రవారం ఉదయం ఐదున్నరకు నడిపే ట్రైన్‌కు మంచి ఆదరణ ఉండటంతో రోజూ ఐదున్నర గంటలకు మొదటి మెట్రో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఉదయం ఐదున్నరకు ఇకపై మూడు కారిడార్ల నుంచి తొలి మెట్రో ట్రైన్ బయల్దేరుతుందని పేర్కొన్నారు.