ఆంధ్రప్రదేశ్

 విశాఖ ఎమ్మెల్సీతో తొలి పరీక్ష

విశాఖపట్టణం, ఆగస్టు 1: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇదే సమయంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 30న జరిగే ఆ ఎన్నికతో కూటమి ప్రభుత్వం తొలి రాజకీయ పరీక్ష ఎదుర్కోబోతోంది. ఇప్పుడున్న అంకెల లెక్కల్లో ప్రతిపక్షం వైసీపీకే ఈ స్థానంలో మెజార్టీ ఉంది. కానీ, ఆ పార్టీకి గెలుపు అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం తన ఆధిపత్యం చెలాయించడం కూడా తేలికైన విషయం కాదు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలకూ సవాల్ గా మారిన విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఎవరి పరమవుతందనేది రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామాతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రూట్ క్లియర్ అయింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎమ్మెల్యేగా పని చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్… ఎన్నికల ముందు తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ తర్వాత విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు ఉండగా, అధికార పార్టీ టీడీపీకి కేవలం 215 ఉన్నాయి. ఈ లెక్కలు పరిశీలిస్తే ఇప్పటికీ వైసీపీకే ఆధిక్యం ఉన్నట్లే. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో అప్పటి అధికార పక్షం వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు వాస్తవ లెక్కలను పరిశీలిస్తే వైసీపీ గెలవడం ఈజీయే. కానీ, ఇక్కడే ఆ పార్టీకి అతిపెద్ద సవాల్ ఎదుర్కోంటోందంటున్నారు పరిశీలకులు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ లెక్కలన్నీ చెదిరిపోయాయంటున్నారు. ఇప్పటికే విశాఖలో పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కొంతమంది ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జడ్పీటీసీలు టీడీపీ గూటికి చేరారు. వీరంతా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో వైసీపీ మెజార్టీకి భారీగా గండి పడిందంటున్నారు. ఐతే ఆ పార్టీ ఓడిపోయేంత సంఖ్యలో టీడీపీలోకి వలసలు లేవని.. అందువల్ల వైసీపీయే ఈ స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అధికార పార్టీ గేట్లు ఎత్తితే వలసలు మరింతగా పెరిగి ఎమ్మెల్సీ స్థానం వైసీపీ చేజారిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందుకే ఈ ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్ గా మారిందని చెబుతున్నారు.ఆగస్టు 30న జరగబోయే ఎన్నికకు ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన జరుగుతుంది. పోటీ ఉంటే 30న ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతుందా? లేక ఏకగ్రీవం అవుతుందా? అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. వాస్తవానికి ఈ స్థానం నుంచి పోటీ చేసి మండలికి వెళ్లాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొద్దిరోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐతే ఇటీవల విశాఖ కార్పొరేటర్లు వైసీపీని వీడిన తర్వాత ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.చేతిలో అధికారం లేకపోవడం వల్ల గెలుపు అంత ఈజీ కాదనే ఆలోచనతోనే అమర్నాథ్ వెనక్కి తగ్గారంటున్నారు. ఇక అధికార పార్టీ అభ్యర్థిగా ఎవరిని పెడుతుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలకు 13 చోట్ల నెగ్గిన ఎన్డీఏ కూటమి గట్టిగా ఫోకస్ పెడితే ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు ఎలా ముందుకు వెళ్తాయనేది చూడాల్సి వుంది.