ఆంధ్రప్రదేశ్

ఆపొజిషన్ స్టేజ్ లో షర్మిళ

విజయవాడ, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ఆయన సోదరి , ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్నది తాను మాత్రమేనని.. ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేననని అన్న  అభిప్రాయాన్ని కలిగించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నిర్లిప్తత..జగన్ బెంగళూరులోనే ఎక్కువ మకాం పెడుతూండటంతో షర్మిల చురుగ్గా ఆలోచించి రాజకీయా వ్యూహాలను అమలు చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదన్న నిర్ణయాన్ని మరింత అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు. చురుగ్గా ప్రజల్లోకి వెళ్లి వారి తరపున తానే పోరాడుతున్నానన్న అభిప్రాయాన్ని కలిపిస్తున్నారు. ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత జగన్ ఇంకా తప్పటడుగులే వేస్తున్నారన్న అభిప్రాయంతో వైసీపీ క్యాడరే కాదు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది అసెంబ్లీకి వెళ్లకపోవడం. అసెంబ్లీలో ఎవరు అవునన్నా.. కాదన్న ఆయన ప్రతిపక్ష నేతనే. కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ తప్ప మరో పార్టీ లేదని అందుకే తమదే ప్రతిపక్షమని ఆయన అంటున్నారు. ఆ విషయాన్ని టీడీపీ కూడా కాదనడం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాను మాత్రం ఇవ్వలేదు. అందుకు పదిశాతం సీట్లు రావాలన్న రూల్ ఉందని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంట్ లో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షహోదా ఈ కారణంతోనే ఇవ్వలేదు. కానీ ప్రతిపక్షంగా గుర్తింపు పొంది పోరాడుతూనే ఉంది. కానీ అలాంటి ప్రతిపక్షంగా పోరాడటానికి జగన్ సిద్దంగా లేరు. నకు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని.. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రారని ఆయన తేల్చి చెప్పారు. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్షమే కనిపించలేదు. కనీసం అసెంబ్లీకి వెళ్లి ఉంటే.. మాట్లాడటానికి చాన్సివ్వకపోతే.. అదే విషయాన్ని ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అసలు వెళ్లకపోతే..  అలా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి .. ప్రభుత్వంపై పోరాటాన్ని పార్టీ కోణలోనే చేస్తున్నారు కానీ.. సాధారణ ప్రజల దిశగా వెళ్లడం లేదు. వినుకొండలో జరిగిన హత్యా ఉదంతంతో ఢిల్లీలో ధర్నా చేశారు. తమ పార్టీ నేతలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది హత్యకు గురయ్యారో వారి వివరాలు ఇవ్వాలని మీడియాతో పాటు టీడీపీ ప్రభుత్వం అడిగినా స్పందించలేదు. అదే్ సమయంలో.. శ్వేతపత్రాల పేరుతో తమ పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఈ పోరాటం అంతా పార్టీ కోణంలోనే జరుగుతోంది కానీ..ప్రజా సమస్యలపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఇక్కడే షర్మిల అడ్వాంటేజ్ తీసుకున్నారు. షర్మిల వర్షాకాలం కారణంగా వచ్చిన వరదలతో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి  గూడెంలో షర్మిల నడుంలోతు నీళ్లు ఉన్న పొలంలోకి దిగి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలెవరూ రైతులను పట్టించుకోలేదు. వరద బాధితుల గురించి ఆలోచించలేదు. చిన్న ప్రకటన కూడా చేయలేదు. ఓ వైపు ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించడానికి మొహమాట పడుతున్న వైసీపీని మరంతగా కార్నర్ చేస్తూ.. తానే ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు వస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజల తరపున పోరాటంలో షర్మిల ముందుకెళ్తే..  వైసీపీకి మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే సరైన సమయంలో జగన్ బయటకు వస్తారని ఆ తర్వాత షర్మిలను ఎవరూ పట్టించుకోరని అనుకుంటున్నారు.మొత్తంగా షర్మిల, జగన్ మధ్య ప్రతిపక్ష నేతగా ప్రజల్లో గుర్తింపు కోసం హోరాహోరీ పోరు సాగుతోందని అనుకోవచ్చు. మరి ఎవరిది పైచేయి అవుతుందో ?