ఆంధ్రప్రదేశ్

 టార్గెట్ బాలినేని...

ఒంగోలు, ఆగస్టు 3: ఒంగోలులో రాజకీయం హైటెన్షన్‌గా మారింది… కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల్లోనే ఇంతలా పొలిటికల్‌ హీట్‌ పెరగడానికి కారణమేంటి? ఒంగోలు రాజకీయాల్లో ఏం జరుగుతోంది.రాష్ట్రంలో హైటెన్షన్‌ నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి…. ఇక్కడ ఎప్పుడూ రాజకీయాలు వాడివేడిగా ఉంటాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మధ్య రాజకీయం మండే అగ్నిపర్వతాన్ని తలపిస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు ఈ ఇద్దరు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమన్నట్లే దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎన్నికల సమయంలో సహజంగా ఉండే ఈ హైటెన్షన్‌… ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు నెలల తర్వాత కొనసాగుతుండటమే హీట్‌ పుట్టిస్తోంది.ఒంగోలు ఎమ్మెల్యేగా నాలుగుసార్లు పనిచేసిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయారు. గత ప్రభుత్వంలో మూడేళ్లపాటు మంత్రిగా పనిచేసిన బాలినేని…. మంత్రి పదవి పోయిన తర్వాత సొంత పార్టీపై కొంత అసంతృప్తితో ఉండేవారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ నిత్యం అలకపాన్పు ఎక్కి… తనకు కావాల్సినవి సాధించుకునే వారు. ఇదే సమయంలో మంత్రి పదవి లేకపోయినా…. జిల్లాలో తనకు ఎదురు లేనట్లే రాజకీయం నడిపే వారు బాలినేని… వైసీపీ అధినేత జగన్‌తో దగ్గరి బంధుత్వం ఉండటంతో జిల్లాలో బాలినేనికి ఎదురు చెప్పే వారు లేకపోయే వారు.దీంతో ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డిపై పలు భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. వీరి కుటుంబానికి చెందిన శ్రీకర విల్లాస్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థపైనా చాలా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో బాలినేనిని ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. ఐతే ఇప్పుడు వైసీపీ ఓటమి తర్వాత బాలినేని టార్గెట్‌గా పావులు కదుపుతున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌… బాలినేని చుట్టూ ఉచ్చుబిగించేలా అడుగులు వేస్తున్నారు.బాలినేనిని రాజకీయంగా ఒంటరి చేయాలనే ఎత్తుగడతో ఒంగోలు కార్పొరేషన్‌పై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే జనార్దన్‌ పలువురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. ఇక బాలినేని అనుచరుడు.. గత ప్రభుత్వంలో బాలినేని బాధితుడైన సుబ్బారావు గుప్తాను తెరపైకి తెచ్చి… బాలినేని హయాంలో జరిగిన అక్రమాలన్నీ తవ్వితీస్తున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు ఒంగోలులో ఎదురే లేదన్నట్లు హవా నడిపిన బాలినేనిని సవాల్‌ చేస్తూ పోస్టర్లు వేస్తుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ల్యాండ్‌, శాండ్‌ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం. ఈ అంశాల్లో బాలినేనితోపాటు ఆయన కుమారుడు, వియ్యంకుడు పేర్లు బయటకు వస్తున్నాయంటున్నారు. అదే సమయంలో గతంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని తాజాగా గుర్తిస్తూ అరెస్టు చేయిస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు టెన్షన్‌ పడుతున్నారు.ఎన్నికల ముందువరకు ఒంగోలులో చక్రం తిప్పిన బాలినేని… ఫలితాలు విడుదలైన తర్వాత ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. ఈ మధ్య ఒకసారి ఒంగోలు వచ్చిన బాలినేని మళ్లీ రెండు నెలల తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోయారు. మరోవైపు బాలినేని, ఆయన అనుచరులు టార్గెట్‌గా ఎమ్మెల్యే దామచర్ల వెంటాడుతుండటంతో వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇటు కేసులు… అటు విచారణలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దామచర్ల…. బాలినేని… ఆయన కుమారుడు, వియ్యంకుడే టార్గెట్‌గా పావులు కదుపుతుండటం రాజకీయంగా ఇంట్రెస్టింగ్‌ మారింది. అధికార పార్టీ విసురుతున్న సవాల్‌ను బాలినేని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తి రేపుతోంది.