తెలంగాణ

గీత దాటుతున్న నేతలు...భాషపై చర్చోపచర్చలు

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ అసెంబ్లీలో  దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన బాషను విన్న ప్రజలు అవాక్కయ్యారు. మొదటి వారం రోజుల పాటు సజావుగా సాగిన సమావేశాలు చివరికి వచ్చేసరికి దారి తప్పినట్లుగా మారాయి. చివరి రోజు దానం నాగేందర్ అత్యంత ఘోరంగా మాట్లాడారు. పైగా అవి వాడుక పదాలేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఉపసంహరించుకున్నప్పటికీ.. అవి ప్రజల్లోకి వెళ్లిపోయాయి. చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ఏపీలో ఐదేళ్ల పాటు ఇదే భాష విచ్చలవిడిగా వినిపించింది. అలాంటి నేతలకు.. ఆ భాషను ప్రోత్సహించిన పార్టీకి అక్కడి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. తేరుకోకుండా దెబ్బకొట్టారు. కానీ ఈ గుణపాఠాన్ని  నేర్చుకోవడంలో తెలంగాణ నేతలు విఫలమయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్  బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు  బెదిరింపులు ఏపీలో కొంత మంది వైసీపీ నేతల్ని గుర్తుకు తెచ్చాయి.   వైసీపీ హయాంలో ఏపీ అసెంబ్లీలో మాత్రమే చూసిన లాంగ్వేజ్ ను ఆయన  తెలంగాణ అసెంబ్లీకి తీసుకు వచ్చారన్న విమర్శలు వచ్చాయి.  తాను అన్నీ సాధారణ వాడుక భాషనే వాడానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.  దానం నాగేందర్   అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ పార్టీ  బీఫాం ఇస్తే గెలిచారు.  ఇది రెండో సారి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ ఆయనకు రెండు సార్లు టిక్కెట్ ఇచ్చింది.   ఇప్పుడు కూడా ఆయన అఫీషియల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ ఆ పార్టీ నేతలపైనే   బూతులు అందుకున్నారు. గెలిచిన పార్టీని అసెంబ్లీలో అలా తిట్టడం.. సభ్యుల్ని  బెదిరించడం ఆయనను  పార్టీలో చేర్చుకున్న పార్టీ నేతలకు కూడా ఇబ్బందికరంగానే మారింది.    కాంగ్రెస్ లోనే కాదు.. బీఆర్ఎస్ లోనూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా ఉంది. ఆయన మహిళా నేతలపై తరచూ అనుచిత వ్యాఖ్యలు  చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీతక్కపై అనుచితంగా మాట్లాడినట్లుగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతకు ముందు గవర్నర్ గా ఉన్న తమిళిశై సౌందరరాజన్‌పై అత్యంత అసభ్యకరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దూకుడుగా ఉండే కౌశిక్ రెడ్డి.. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో గీత దాటుతున్నారు. ఇది తరచూ విమర్శల పాలవుతోంది. ఏపీలో ఐదేళ్ల కాలంలో రాజకీయ భాష ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయింది. అసెంబ్లీలోనే కాదు.. బయట కూడా అత్యంత ఘోరంగా తిట్టుకున్నారు. మహిళా నేత రోజా కూడా తీసిపోలేదు. ఇలా వారి భాష వినీ వినీ చిరాకు పడిన ప్రజలు ఆ బూతు నెతలు ఎవర్నీ మరోసారి అసెంబ్లీకి  పంపించలేదు. అత్యంత ఘోరంగా ఓడించారు. బూతు నేతలందరికీ పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత వారెవరూ బహిరంగంగా కనిపించడం లేదు. అంతా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి నిర్వాకం కారణంగా వారి పార్టీ కూడా ఘోరంగా  ఓడిపోయింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. అహంకారం చూపించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు సహించరు. తమదైన రోజున ఓటుతో బుద్ది చెబుతారు. తాము గొప్పగా బటన్లు నొక్కి డబ్బులిచ్చామని.. ్ందుకే తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతామని అనుకుంటే..  ఏపీలో ఎన్నికల ఫలితాల్లాంటివే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో .. కాస్త ఘాటుగా మాట్లాడినా ప్రజలు అది ఉద్యమ ఆవేశం అనుకున్నారు కానీ.. ఇప్పుడు మాత్రం..  రాజకీయాల్లో ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ను ప్రయోగిస్తే… ప్రజలే ముందుగా శిక్షించడానికి సిద్ధమవుతారు. చట్టసభల్లోనే కాదు..బయట కూడా..  ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన  బాధ్యత నేతలదే. ఎందుకంటే వారిని ఎన్నుకున్నది ప్రజలే మరి.
పూర్వపు వైభవం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రెండు రోజుల్లో కొన్ని ఘటనలు మినహా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా ప్రజా సంబంధిత అంశాలపై ఎక్కువగా చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష నేతలు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్క బడ్జెట్ ప్రసంగం రోజున మాత్రమే సభకు వచ్చారు. ఆయనకు సభకు రాకపోవడంతో కాంగ్రెస్ పదే పదే కార్నర్ చేసింది. అయితే మీకు మేము సరిపోతామని కేటీఆర్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో రాజకీయ అంశాలు చర్చకు రావడం.. పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి రావడంతో చర్చ దారి తప్పింది. మహిళల్ని రేవంత్ అవమానించారని .. బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంతో.. సభలో సస్పెన్షన్లు, వాకౌట్లు లేవనుకుంటున్న సమయంలో వాటికి చోటిచ్చినట్లయింది. సస్పెన్షన్లు లేకపోయినప్పటికీ  వాకౌట్లు.. స్పీకర్ చాంబర్ ఎదుట ధర్నాలు చోటు చేసుకున్నాయి. అలాగే  చివరి రోజు దానం నాగేందర్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం కూడా వివాదాస్పమయింది. ఇవి  మినహా.. తెలంగాణ అసెంబ్లీ ప్రజాస్వామ్య వాదులకు కొత్త ఆశలు రేపేలా సాగిందని అనుకోవచ్చు. ప్రజాప్రతినిధుల మొదటి విధి.. చట్టాలు చేయడం. చట్టసభలకు హాజరై.. కీలకమైన అంశాలపై చర్చించడం కీలకం. చర్చల్లోనే తప్పు ఒప్పులు బయటపడతాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టవచ్చు.  కానీ మారుతున్న రాజకీయంలో అసెంబ్లీ ప్రాధాన్యం తగ్గించడానికి అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలు రేపుతోంది.