తెలంగాణ

జీరో టిక్కెట్ తో మోసాలు

హైదరాబాద్, ఆగస్టు 6: లంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా నడుస్తోంది. ఆరు నెలలుగా ఈ పథకం ఎలాంటి అంతరాయం లేకుండా అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెంచుతూ ఊరటనిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో బస్సులలో మామూలు కన్నా ఆక్యుపెన్సీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకుంటోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడలేదని అంటున్నారు. మొదట్లో ఈ పథకం అమలు చేయడంలో ఉన్న లోటుపాట్లను సరిచేయడానికి ఆర్టీసీ అధికారులు జీరో టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నారు.ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళకూ జీరో టిక్కెట్లను కొట్టడం ద్వారా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించే అవకాశం లేదు. దీనితో ఏ రోజుకారోజు ఎంత మంది తిరిగారో వారిపై ఎంత ఆదాయం అనేది జీరో టిక్కెట్ల ద్వారా ప్రభుత్వానిి తెలుస్తుంది. అయితే దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు కండెక్టర్లు. అసలే అంతంత మాత్రంగా వస్తున్న ప్రభుత్వాదాయానికి ఏకంగా గండిపెట్టేందుకు యత్నిస్తున్నారు. జీరో టిక్కెట్లు కేవలం ఆడవారికి మాత్రమే ఇవ్వాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా మగవారి వద్ద డబ్బులు తీసుకుని జీరో టిక్కెట్లు ఇస్తున్నారు కండెక్టర్లు. బస్సు ప్రయాణంలో అవన్నీ పట్టించుకోరు కదా ప్రయాణికులు అనుకుంటే పొరపాటే. కొందరు మాత్రం తాము చెల్లించిన డబ్బుకు సరిపడ టిక్కెట్ లో ఉందా లేదా అని చూసుకుంటారు. ఇదేంటని ఎవరైనా కండెక్టర్ ను నిలదీస్తే..సారీ పొరపాటున ఇచ్చానని మళ్లీ వాళ్లకు మామూలు టిక్కెట్లు ఇస్తున్నారు. ఇదంతా దొరికితే దొంగ లేకుంటే దొర అన్న రీతిగా కండెక్టర్లు యథేచ్ఛగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా బొక్క పెడుతున్నారు.ఇటీవల హైదరాబాద్ లో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. దానితో కండెక్టర్ ను గట్టిగా నిలదీసేసరికి పొరపాటున ఇచ్చామని ఆ టిక్కెట్ రిటర్న్ తీసుకుని మామూలు టిక్కెట్ ఇష్యూ చేశాడు ఆ కండెక్టర్. మొత్తానికి ఈ వార్త ఆర్టీసీ అధికారులకు ఎట్టకేలకు చేరింది. దానితో మగవారి టిక్కెట్లను కూడా బస్సు ఆపి చెకింగ్ చేస్తున్నారు.గతంలోనూ ఆర్టీసీ బస్సు కండెక్టర్లపై చిల్లర తిరిగి ఇవ్వరని, ఒక్కో టిక్కెట్ పై పావలా, అర్థ రూపాయిలను చిల్లర లేదంటూ జేబుల్లో వేసుకునేవారు. దీనితో ప్రతి రోజూ చిల్లర సమస్యతో ఆర్టీసీ అధికారులు రౌండ్ ఫిగర్ చేసి టిక్కెట్ అమ్మకాలు కొనసాగించారు. చిల్లర సమస్య తీరడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు జీరో టిక్కెట్ల అంశంలో ఇప్పటిదాకా జరిగిన స్కామును బయటకు తీసే పనిలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు.