రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారిశ్రామిక రంగంలో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ వేగంగా దూసుకెళ్తోందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందన్నారు.
తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నందునే పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.