తెలంగాణ

ఢిల్లీలో  గులాబీ నేతలు...మద్దతు కోసమేనా

హైదరాబాద్, ఆగస్టు 7: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఢిల్లీలో ఎందుకు మకాం పెట్టారా? కవితతో సమావేశం అయ్యేందుకు వెళ్లారా? లేక రాజకీయ వ్యవహారాల కోసం వెళ్లారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్టయి జైలులో ఉన్నారు. దాదాపు ఐదు నెల లు గడిచిపోయాయి. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ అభ్యర్థనతో న్యాయస్థానం బెయిల్ ఇవ్వలేదు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. కానీ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.మంగళవారం ములాఖత్ సమయంలో తీహార్ జైలులో ఉన్న కవితతో మరోసారి భేటీ అయ్యారు కేటీఆర్, హరీష్‌రావులు. ఇరువురు మధ్య దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. నాన్న కేసీఆర్ ఆరోగ్యం ఎలా వుందని కేటీఆర్‌ను కవిత అడిగినట్టు తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు వార్తల్లో చూశానని గుర్తు చేశారట. పిల్లలు ఎలా ఉన్నారని, తనను బయటకు వేగంగా తీసుకెళ్లాలని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఉండలేకపోతున్నారని చెప్పారట. బెయిల్ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ఢిల్లీలో బీజేపీతో బీఆర్ఎస్ మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అలాంటి దేమీ జరగలేదని అంతర్గత సమాచారం. ఈ తరహా ఫీలర్ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు బయటకు వదిలాయని సమాచారం. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారోనని గులాబీ బాస్ గమనిస్తున్నార ట. ఈ విషయంలో టీ బీజేపీ నేతలు రియాక్ట్ కాకుండా ఉండాలనే ఆలోచనతో ఈ స్కెచ్ వేశారన్నది కొందరు నేతల మాట.బీజేపీతో గనుక చర్చలు జరిపితే కవితకు బెయిల్ ఎప్పుడో వచ్చేదని అంటున్నారు. గతంలో చాలామంది నేతలు కమలనాధులతో చర్చలు జరిపిన వారం, పది రోజులకు జైలు నుంచి బయటకు వచ్చిన విషయా లను గుర్తు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలను నోరు ఎత్తుకుండా ఉండేందుకు.. పార్టీ మారిన నేతల విషయమై ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్లతో చర్చిస్తున్నట్లు పైకి చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ చర్చల గురించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.