ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వర్మ దారెటు...

కాకినాడ, ఆగస్టు 13: మ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం పేరు పెద్దగా ప్రాచూర్యం పొందలేదు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తానని ప్రకటించటంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పిఠాపురంలో టీడీపీ హవా సాగుతున్న సమయంలో అక్కడ నుంచి పోటీకి వర్మ సిద్ధపడ్డారు. స్వయంగా జనసేన అధినేత కోరటంతో మిత్రపక్షంలో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. తొలుత దీనికి వర్మ నిరాకరించినా.. టీడీపీ అధిష్టానం బుజ్జగింపుతో ఆయన ఒప్పుకున్నారు. పోటీ నుంచి తాను తప్పుకుని పవన్‌కల్యాణ్‌కు అవకాశం ఇచ్చారు. అంతే కాదు.. పవన్‌ విజయంలో వర్మ కీలకపాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు. పవన్‌ను పిఠాపురంలో ఓడించేందుకు వైసీపీ సర్వశక్తులూ ఒడ్డినా.. ఆ ప్రభావం లేకుండా చేసి అటు జనసైనికులు.. ఇటు టీడీపీ శ్రేణులు కలసి పవన్ కల్యాణ్ విజయంలో కీలకంగా మారారు.పిఠాపురంలో విజయం తర్వాత పవన్‌.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి.. కీలకశాఖలు తీసుకున్నారు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. అయితే.. కొత్త సమస్య వచ్చి పడిందని వర్మ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయట. జగన్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం ఫిక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పవన్‌కల్యాణ్‌… ఇక్కడే పాగా వేస్తే.. తమ నేత పరిస్థితి ఏంటని వర్మ అభిమానులు చర్చించుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.2009లో టీడీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసిన వర్మ ఓటమి చెందారు. 2014లో తెలుగుదేశం నుంచి సీటు దక్కకపోవటంతో అధిష్టానంతో విభేదించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ విజయం సాధించారు. అనంతరం టీడీపీలో తిరిగి చేరారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా తిరిగి పిఠాపురం బరిలో నిలిచినా.. ఫ్యాన్ సునామీ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. గత ఎన్నికల్లో గెలిచి తీరాలని జనంలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసి.. టిక్కెట్ దక్కించుకునే వరకూ వెళ్లారు. ఎప్పుడైతే పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురం సీటు కోరుకున్నారో.. అక్కడ నుంచి వర్మకు కష్టకాలం మొదలైందని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు.. తాను నియోజకవర్గం మారతానంటూ వస్తున్న వార్తలపై వర్మ స్పందిస్తూనే ఉన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని.. పిఠాపురంలో ఎంతమంది నాయకులు వచ్చిన తన ప్రాబల్యం తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ వర్మను వేరే నియోజకవర్గానికి పంపిస్తే.. కార్యకర్తలు ఒప్పుకుంటారా అనే ప్రశ్న నెలకొంది.పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించినప్పుడే వర్మ వర్గీయులతో పాటు టీడీపీ కార్యకర్తలూ ఆందోళనకు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్.. పిఠాపురాన్ని సొంత నియోజకవర్గంగా మార్చుకోవడం సాధ్యమేనా అనేది ఉత్కంఠగా మారింది. వర్మకు నామినేటెడ్ పదవి ఇచ్చి.. మరొక నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా చేస్తారంటూ ప్రచారనే ప్రచారం కూడా సాగుతోంది.పవన్ కళ్యాణ్ మాత్రం నియోజవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నారని విషయం క్లియర్ గా అర్థమవుతుంది. స్థానిక సమస్యలపై సమగ్రంగా నివేదికలు తెప్పించుకుని పరిష్కారాలు చూపేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా బిజీబిజీగా గడుపుతున్నా నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. మాటల కాకుండా డిప్యూటీ సీఎం చేతలలో నియోజకవర్గంలో తనదైన మార్క్ వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు… కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ వర్మ కూడా.. తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లి పోతున్నారు. పెన్షన్ పెంపు కార్యక్రమం నుంచి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ పాల్గొంటూ జనాలకు దగ్గరవుతున్నారు.రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది చివరి క్షణం వరకు ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో వర్మ భవితవ్యంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్,, సొంత నియోజకవర్గంగా మార్చుకుంటే .. తన నేత భవిష్యత్తు ఏంటనే అంశంపై వర్మ అభిమానులు చర్చించుకుంటున్నారనే విషయం సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. అసలు నియోజకవర్గాన్ని వదిలి.. వేరే చోటకు వెళ్లేందుకు వర్మ సుముఖంగా ఉన్నారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.