తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణ పత్తికి మస్తు గిరాకీ

  • సీసీఐకి అత్యధికంగా అమ్మింది మనమే
  • రికార్డు విక్రయాలతో దేశంలోనే ఫస్ట్‌
  • 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొన్న సీసీఐ
  • మహారాష్ట్ర, గుజరాత్‌ వెనక్కి: కేంద్రం
  • ఈసారీ రాష్ట్రంలో భారీగా పత్తి సాగు

పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిన్న మొన్నటి వరకు ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2020-21లో దేశవ్యాప్తంగా పత్తి అమ్మకాల్లో తెలంగాణ నంబర్‌ 1గా నిలిచింది. ఒక్క మన రాష్ట్రం నుంచే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఏకంగా 1.78 కోట్ల క్వింటాళ్ల (178.55 లక్షల క్వింటాళ్లు) పత్తిని కొనుగోలు చేయటం గమనార్హం. దేశంలో ఇదే అత్యధికమని సీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశంలో పత్తి కొనుగోళ్లపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పత్తిని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నది. సీసీఐ మహారాష్ట్ర నుంచి 91.98 లక్షల క్వింటాళ్లు, హర్యానా నుంచి 55.49 లక్షల క్వింటాళ్లు, రాజస్థాన్‌ నుంచి 47.83 లక్షల క్వింటాళ్లు, పంజాబ్‌ నుంచి 28.14 లక్షల క్వింటాళ్లు, గుజరాత్‌ నుంచి 21.79 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు వెల్లడించింది.

పరిస్థితి మారింది.. సాగు పెరిగింది
కొన్నేండ్లుగా పత్తి ఎక్కువగా పండించే రాష్ర్టాల్లో తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ వరుసగా ఉన్నాయి. కానీ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు మారడంతో పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో 2019-20లో రెండో స్థానానికి, 2020-21లో తొలిస్థానానికి చేరింది. గతేడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పత్తి పంట దెబ్బ తిన్నది. అధిక వర్షాల ప్రభావం లేకపోయుంటే ఇంకా భారీ మొత్తంలో పత్తి పండేదని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్‌ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను పత్తి సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నది. 2018-19లో 45.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 2019-20లో 54.45 లక్షల ఎకరాలకు పెరిగింది. 2020-21లో తెలంగాణ ప్రభుత్వం పత్తిపై మరింత ఫోకస్‌ పెట్టి రైతులను ప్రోత్సహించింది. ఫలితంగా 60.53 లక్షల ఎకరాలకు పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. 2021-22లో కూడా రాష్ట్రంలో పత్తి భారీ సాగు దిశగా కొనసాగుతున్నది. ఇప్పటికే 50 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది.

తెలంగాణ పత్తికి భారీ డిమాండ్‌
ప్రపంచ మార్కెట్లో తెలంగాణ పత్తికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మహారాష్ట్ర, గుజరాత్‌లో పండే పత్తితో పోల్చితే మన పత్తి నాణ్యతను కలిగి ఉంటుంది. గింజ పొడవు (స్టేపుల్‌ లెంత్‌) అధికంగా ఉండటంతో మంచి దారం వస్తుంది. దీంతో మన పత్తికి అంతర్జాతీయంగా అధిక డిమాండ్‌ పలుకుతున్నది. సీసీఐతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు తెలంగాణ పత్తి కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు వ్యాపారులు కూడా ముందుగా తెలంగాణ పత్తి కొనటానికే మొగ్గు చూపుతారు. 2020-21లో తెలంగాణలో సుమారు 50 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. ఈ లెక్కన తెలంగాణలో 2020-21లో సుమారు 230 లక్షల క్వింటాళ్ల పత్తి పండింది.