ఆంధ్రప్రదేశ్

ఆంధ్రాలో కాకతీయుల తమిళ శాసనం

ప్రకాశం జిల్లా మోటుపల్లి కోదండ రామాలయంలో గుర్తింపు

తమిళ ప్రజల కోసం 1308లో ప్రతాపరుద్రుడు వేయించినట్టు నిపుణుల వెల్లడి

ఓరుగల్లు (తెలంగాణ) కేంద్రంగా పాలించిన రాజు.. ఆంధ్రాలోని ఓ దేవాలయం.. అక్కడ తమిళంలో శాసనం.. కాకతీయ చక్రవర్తుల అద్భుత పాలన తీరుకు మరో సజీవ సాక్ష్యమిది. నాటి చక్రవర్తి ప్రతాపరుద్రుడు కొంతమేర తమిళులున్న ఓ ప్రాంతంలో వారి సౌకర్యం కోసం తమిళ భాషలో శాసనం వేయించడం విశేషం.

నష్టపోయిన వారికి బీమా కోసం.. 
ప్రస్తుతం ఏపీలోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లిలో క్రీస్తు శకం 1244వ సంవత్సరంలో కాకతీయ గణపతి దేవచక్రవర్తి ఓ శాసనం వేయించారు. ఆనాటి సముద్ర వాణిజ్యంలో భాగంగా ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే ఆదుకునేందుకు బీమా పథకాన్ని ప్రారంభిస్తూ.. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో శాసనం రాయించారు. మళ్లీ 64 ఏళ్ల తర్వాత 1308 ఆగస్టు 1న అదే మోటుపల్లిలో ప్రతాపరుద్రుడు తమిళంలో వేయించిన మరో శాసనం తాజాగా వెలుగు చూసింది. మోటుపల్లి కోదండ రామాలయ రాజగోపురం గోడ రాళ్లలో తమిళంలో రాసి ఉన్న శాసనాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం గుర్తించారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం మోటుపల్లి హెరిటేజ్‌ సొసైటీ అధ్యక్షుడు బొండా దశరామిరెడ్డి ఆహ్వానంపై వెళ్లిన ఆయన.. ఆలయాన్ని పరిశీలించే క్రమంలో ఈ శాసనం వెలుగుచూసిందని తెలిపారు.

గోడ నిర్మాణంలో అడ్డంగా పెట్టిన ఆ ఓ రాయిపై ఉన్న అక్షరాలను అచ్చు తీసి చదవగా.. ప్రతాపరుద్రుడు వేయించిన దాన శాసనంగా తేలిందని వివరించారు. దీనిపై కేంద్ర పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డిని సంప్రదించామన్నారు. గతంలో ఆ శాసనం నకలును తీశామని.. మోటుపల్లిని దేశి ఉయ్యకొండపట్నమని, ఒక తమిళ ఉత్సవానికి కొంత భూమిని దానం చేసినట్టు అందులో ఉందని మునిరత్నంరెడ్డి వివరించారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ శాసనం వివరాలను అధికారికంగా రికార్డు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మోటుపల్లి పోర్టు పూర్వకాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేదని, వ్యాపార రీత్యా తమిళులు పెద్దసంఖ్యలో వచ్చి స్థిరపడ్డటంతో ప్రతాపరుద్రుడు తమిళంలో శాసనం వేయించి ఉంటారని శివనాగిరెడ్డి తెలిపారు.

గణపతిదేవుడు నిర్మించిన ఈ ఆలయం మొదట్లో ఇది చెన్నకేశవ దేవర పేరుతో ఉందని, ఈ మేరకు ఓ శాసనం ఉందని చెప్పారు. సుమారు 50 ఏళ్ల కింద ఆలయంలోని విగ్రహం భిన్నంగా ఉందంటూ తొలగించి.. కోదండ రామాలయంగా మార్చారని వెల్లడించారు. తాజా శాసనంలో ఈ ఆలయాన్ని రాజనారాయణ పెరుమాళ్‌గా ప్రస్తావించారని తెలిపారు. అరుదైన ఈ శాసనాన్ని వెలికి తీసి ప్రత్యేకంగా ప్రతిష్టించాల్సి ఉందన్నారు.