కష్టకాలంలో వారంతా పార్టీ వెన్నంటే ఉన్నారు అధికారంలోకి వచ్చేందుకు ఐదేళ్లపాటు తీవ్రంగా శ్రమించారు. గత ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ.. అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి కేసులు పెట్టించుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కష్టాలు నుంచి గట్టెక్కుతామని భావించారు. అయితే వారి ఆశలు అడియాశలవుతున్నాయి. గతంలో అధికార పార్టీలో ఉన్న వారంతా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి వలస వస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా వారి పెత్తనమే భరించాలా అని నాయకుల్ని నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడంటారా?నెల్లూరు జిల్లాలో గత అయిదేళ్లు వైసీపీ పెత్తనమే నడిచింది. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు వైసీపీ దక్కించుకుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్న 54 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే.. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక సార్లు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసి కేసుల పాలయ్యారు.
ప్రత్యర్ధుల వేధింపులు తట్టుకోలేక పలువురు సొంతూళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది.అలాంటి వారి ఎదురుచూపులు ఫలించి 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తమకు మంచి రోజులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచిన ఆ పార్టీ నేతలు నిరాశనిస్పృహల్లోనే కనిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నించిన తమకు సరైన గుర్తింపు లేదని వాపోతున్నారు. మరో పక్క వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూలు కడుతుండటం వారిని మరింత కలవరపరుస్తోంది.రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి అంత కాలం పెత్తనం చెలాయించిన వైసీపీ నేతలు పక్కచూపులు చూడటం మొదలుపెట్టారు. గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీ మారడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మంచి సమయం చూసుకొని అధికారికంగా సైకిల్ ఎక్కేందుకు ముహూర్తాలు సిద్ధం చేసుకున్నారు.
అయితే పార్టీలో చేరేందుకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మూడు నెలలపాటు ఎదురుచూపులు తప్పలేదు.ఇటీవలే ఇతర పార్టీ నేతలను ముఖ్యంగా వైసిపి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీలో ఉన్న నేతలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుర్చుకునేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న 54 మంది కార్పొరేటర్లలో సుమారు 45 మంది పైగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరొక పక్క ఆర్యవైశ్య సంఘం నేత ముక్కాల ద్వారకానాథ్ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే ఓసారి మంత్రి నారాయణ ద్వారా ద్వారకానాథ్ చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయంట. ఏడు మంది కార్పొరేటర్లతో కలిసి ముక్కాల ద్వారకానాథ్ విజయవాడలోని మంత్రి కార్యాలయంలో కలిశారు. చంద్రబాబు నాయుడుని కలిసి అనంతరం సోమవారం ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే తంతు పూర్తవుతుందని సమాచారం.
అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్నారు. ఈ తతంగాలన్నీ తెలిసి జిల్లా తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నిరాశకు లోనవుతున్నాయి. అంత మంది కార్పొరేటర్లను చేర్చుకుంటే ఆయా డివిజన్లలోని తమ పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు వాపోతున్నారు.వైసిపికి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో కూటమి అధికారంలోకి రావడంతో పరిస్థితి తారు మారవుతోంది. తమ హయాంలో చేసిన అక్రమాల నుంచి తప్పించుకోవడానికి.. వేధింపుల నుంచి బయటపడటానికి పార్టీ మార్పు శరణ్యమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో 40 శాతం ఓటు బ్యాంకు దక్కించుకున్న వైసీపీని పూర్తిగా బలహీనపర్చడానికి టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.దాదాపు ఐదేళ్లపాటు నాటి అధికార వైసిపి నుంచి ఎన్నో అవమానాలు భరించి అక్రమ కేసులు పెట్టించుకుని.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని అతి కష్టం మీద పార్టీ జెండాను భుజాన మోసారు సింహపురి తమ్ముళ్లు.. ఎలాగైనా సరే టిడిపి అధికారంలోకి రావాలని తెలుగు తమ్ముళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డారు.
ఎన్నికల ముందు సర్వం ధారపోసి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని కృషిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నా నేటికీ తమ్ముళ్లలో అధికారంలోకి వచ్చిన ఆనందం కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం లో దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కోసం శ్రమించిన ఎందరో తమ్ముళ్లు నేడు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తమను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడని ఆరోపిస్తున్నారుఓవైపు నగర ఎమ్మెల్యే, మంత్రి నారాయణ కార్యకర్తల కోసం తాను అనేక పనులు చేస్తున్నానని.. అడిగిన వెంటనే ఆర్థిక సహాయం, అనేక పనులను చేసి పెడుతున్నానని చెబుతున్నా.. కొందరు నేతలు మాత్రం అసలు అధికారంలోకి వచ్చామా లేదా అనే సందేహంలోనే గడుపుతున్నారు. నగరంలో ఎలాంటి పనులు కావాలన్నా బూత్ స్థాయిలో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని బట్టి మంత్రి ఆంతరంగీకులు పనులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరు శ్రమిస్తేనే నారాయణకు 70 వేలకు పైగా మెజార్టీ లభించిందని, కానీ మెజారిటీ తగ్గిన చోట అక్కడి నేతలకు ఎలాంటి పనులు జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
మరోవైపు చేరికలపై కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వైసిపిలో అధికారం అనుభవించిన పలువురు నేతలు అతి త్వరలోనే తెలుగుదేశం పోటీకి వస్తున్నారన్న సమచారంతో వారంతా కలవరం చెందుతున్నారు. అలాంటి వారంతా పార్టీలోకి వస్తే ఇంతకాలం అవమానాలు, అక్రమ కేసులను ఎదుర్కొన్న తమ పరిస్థితి ఏమిటని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం పూర్తిస్థాయిలో పున: పరిశీలించి చేరికల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నారు.