తెలంగాణ రాజకీయం

రెండుగా చీలిన గులాబీ పార్టీ..

బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోందా? ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ- కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై కారు పార్టీలో అంతర్గత ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉన్నారు? అధినేత ఉండమన్నారా? తమ కుర్చీ కిందకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యేలు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారా? అధినేత కేసీఆర్ సైలెంట్ వెనుక కారణం అదేనా? దీన్ని హ్యాండిల్ చేయమని కేటీఆర్ అప్పగించారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ- కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని హరీష్‌రావు, కేటీఆర్‌లు మాత్రమే స్పందించారు. దీన్ని శాంతిభద్రతల ఇష్యూగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రాంతీయం చిచ్చు ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.

రీసెంట్‌గా జరిగిన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జారిపోయింది. 15 సీట్లకు గాను ఖైరతాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కారు పార్టీ కీలక నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఆ సంఖ్య 12కి పడిపోయింది.ప్రాంతీయం మాటల ఎపిసోడ్ తమ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపుతుందే మోనని భయపడుతున్నారు మిగతా ఎమ్మెల్యేలు. కౌశిక్‌రెడ్డి ఇంటి ఘటన తర్వాత ఆయనను పరామర్శించేందుకు గ్రేటర్ పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ విడివిడిగా వెళ్లారు. ఏ ఒకొక్కరుగా నోరు మెదపలేదు. మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేయలేదు.గ్రేటర్‌‌లోని ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ఓటములు శాసించే స్థాయిలో ఆంధ్రా ఓటర్లు ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరువు కాపాడింది వాళ్లే. ఈ సమయంలో కౌశిక్‌‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడి ఇరుక్కోవడం ఎందుకని భావిస్తున్నారట.

ఈ విధంగా తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకోవడం కంటే.. దూరంగా ఉండడమే బెటరని దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ అంతర్గత సమాచారం.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి రోజున మరి కొందరు ఎమ్మెల్యేలు కారు దిగి అధికార పార్టీ గూటికి చేరుతారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ ఇష్యూని హ్యాండిల్ చేయమని కేటీఆర్‌కు అధినేత కేసీఆర్ అప్పగించినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో యువనేత ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం కారు పార్టీలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.