ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తిరుపతి లడ్డులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జంతువుల కొవ్వు ఉపయోగించింది

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్వహణ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఇదివరకటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ఘోరమైన నిందలు వేశారు. తిరుపతి లడ్డులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జంతువుల కొవ్వు ఉపయోగించిందని ఆరోపించారు. అయితే ఈ నిందను వైఎస్ఆర్సిపి తిరస్కరించింది. పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో లడ్డును తిరుమల తిరుపతి దేవస్థానమే పంచిపెడుతుంది. కాగా తిరుపతి లడ్డులో నాసి రకం దినుసులు వాడుతున్నారని సాక్షాత్తు ఆప్ర ముఖ్యమంత్రే ఆరోపించారు. ఈ విషయాన్ని పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది.

కాగా ఇప్పుడు స్వచ్ఛమైన నేతిని వాడుతున్నట్లు నారా చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. లడ్డు తయారీ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేశ్ కూడా విమర్శించారు. ‘‘తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరం మనకు ఎంతో పవిత్రమైనది. అయితే తిరుపతి ప్రసాదంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతు కొవ్వును ఉపయోగించారని తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము’’ అని లోకేశ్ విమర్శించారు.ఇదిలావుండగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు, మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు ఆరోపణలను తూర్పారబట్టారు. చంద్రబాబు నాయుడు ఆరోపణలన్నీ ‘దురుద్దేశపూర్వకమైనవి’ అన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు రాజకీయ ప్రయోజనం కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారని ఆక్షేపించారు.