తెలంగాణ రాజకీయం

చిక్కుల్లో కేటీఆర్

అమృత్ స్కీమ్ టెండర్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ధి చేకూరేలా కుట్రలు జరిగాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ తరచూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఈ వివాదంపై మంత్రి పొంగులేటి స్పందించి ఖండించారు. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టెండర్ దక్కించుకున్న శోధా కంపెనీ యజమాని మనోహర్ రెడ్డి కూడా మండిపడ్డారు. ఇదే క్రమంలో ఆయన కుమారుడు సృజన్ రెడ్డి స్పందించి కేటీఆర్‌కు నోటీసులతో షాకిచ్చారు. అమృత్ టెండర్ల విషయంలో ఆరోపణలపై కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని అందులో పేర్కొన్నారు. ఇకనైనా తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తనపై మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని సృజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ లీగల్ నోటీసులు పంపించారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమృత్ స్కీమ్ టెండర్లకు ఆహ్వానించింది కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత, ప్రతిమ ఇన్‌ఫ్రా, పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్, మేఘా ఇంజనీరింగ్‌, గజా ఇంజినీరింగ్‌లకు వాటిని కట్టబెట్టింది. అన్ని కంపెనీలు టెండర్ ధరపై 3.99 శాతం అధికంగా కోట్ చేశాయి. దీంతో సదరు కంపెనీలన్నీ సిండికేట్ అయ్యాయన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పడ్డాక, అమృత్ స్కీమ్ టెండర్లను రద్దు చేసింది. కొత్తగా టెండర్లకు పిలిచింది. ఈ టెండర్లలో రూ.1,137 కోట్ల పనులను ఏఎంఆర్ – ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ, శోధా కన్‌స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్‌‌ ద్వారా దక్కించుకున్నాయి. రెండు శాతం తక్కువ ధరకే కోట్ చేసి పనులను సాధించాయి. ఇందులో రూ.330 కోట్ల విలువైన పనులకే శోధా కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తోంది. కానీ, రూ.8,888 కోట్ల స్కామ్ జరిగిందంటూ కేటీఆర్‌ ఆరోపణలు చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని శోధా కంపెనీ యజమాని మనోహర్ రెడ్డి కుమారుడు సృజన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై అనవసర ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు.