ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు

తిరుమల లడ్డు వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందులోని సభ్యుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్సార్ జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు, తిరుపతి అదనపు ఎస్పీ (అడ్మిన్) వెంకటరావు, డీఎస్పీలు జి.సీతారామరావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఎస్బీ ఇన్స్పెక్టర్ టి.సత్య నారాయణ, ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం.సూర్య నారాయణను సభ్యులుగా నియమించారు. విచారణలో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి సిట్ సమాచారం కోరవచ్చు.
మొత్తం 9 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సమావేశమై తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చించారు. డీజీపీ వారికి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఉత్కంఠ నెలకొని ఉండటంతో దర్యాప్తును క్షుణ్ణంగా చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు.
లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కారణంగా కోట్లమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం పేర్కొంది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఈ వ్యవహారంపై సిట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని నిర్ణయించినట్లు వివరించింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై బృందం విచారిస్తుంది. సిట్కు సహకారం అందించాలని టీటీడీ ఈవోను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
శ్రీవారి లడ్డూ తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై చర్యలకు ఉపక్రమించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి నాణ్యతలేని, కల్తీనెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత, విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది. టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.