ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కొలికపూడికి నోటీసులు...

టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత ఐదేళ్లుగా గట్టిగానే వాయిస్ వినిపించారు. అందుకే చంద్రబాబు పిలిచి మరి తిరువూరు టికెట్ కేటాయించారు. ఆయన గెలుపు కష్టమని అంతా భావించారు. కానీ టిడిపి తో పాటు కూటమి సమన్వయంతో పనిచేయడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తన గెలుపునకు కృషి చేసిన సొంత పార్టీ శ్రేణులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొలికపూడి. ఇలా గెలిచారో లేదో యంత్రాలతో సిద్ధమయ్యారు. ఓ వైసీపీ నేత ఇంటిని నేలమట్టం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. అంతటితో ఆగకుండా టిడిపి సర్పంచ్ పై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో సంచలనం గా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి.

ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు ఇచ్చాయి. ఈ ఎమ్మెల్యే వద్దని.. ఇన్చార్జిని నియమించాలని డిమాండ్ చేశాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఆయన రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒకసారి చంద్రబాబు పిలిచి మాట్లాడారు. ఇప్పుడు మరోసారి పిలిపించి గట్టి హెచ్చరికలే పంపారు. అయితే ఇప్పటికే కొలికపూడి నియోజకవర్గంలో దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కథనాలు వస్తుండడం విశేషం.తిరువూరు నియోజకవర్గంలో పేకాట శిబిరాల ఏర్పాటులో కొలికపూడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో ఎక్కువ వాటాలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఇవ్వకుంటే కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎన్నికల కోసం ఒకరి దగ్గర కోటి రూపాయలు అప్పు చేశారని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 20 లక్షల రూపాయలు చెల్లించి.. దిక్కున చోట చెప్పుకోమని అన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా ఎమ్మెల్యే కొలికపూడిఫై లైంగిక ఆరోపణలు కూడా రావడం విశేషం. ఏదైనా పనితో అతని దగ్గరకు వెళ్తే మహిళలను లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మహిళ అధికారులు, ఉద్యోగులు ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరడంతో ఇటు టిడిపి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టిడిపి శ్రేణులు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నాయి. ఇటీవల రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ రావును కలిసిన వారు సమస్యను విన్నవించారు. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు క్యాడర్ ని, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై సీరియస్ గా దృష్టి సారించారు చంద్రబాబు. ఎమ్మెల్యే కొలికపూడిని పిలిచి మరి మాట్లాడారు. ఎమ్మెల్యే పనితీరుపై చంద్రబాబు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఖాజాగా వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంత? అనే దానిపై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. అయితే నియోజకవర్గంలోని మెజారిటీ క్యాడర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చెప్పినట్లు సమాచారం. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇంచార్జిని నియమించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే హై కమాండ్ షాకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో?