ఒకరేమో ప్రస్తుత సీఎం.. మరొకరు మాజీ సీఎం.. వీరిద్దరూ కలిశారు.. మాట్లాడుకున్నారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ఏమి మాట్లాడుకున్నారు.. ఏ విషయంపై చర్చించారన్నది మాత్రం బయటకు రాని పరిస్థితి. వీరి కలయిక వెనుక ఏదైనా అంతరార్థం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీ కానున్నారు. ఈ సంధర్భంగా రాజకీయ పరమైన అంశాలపై చర్చ సాగనుండగా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది అంశాలు కూడా వీరి మధ్య చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోలవరం అంశంపై చర్చించి.. ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యేందుకు బాబు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇలా ఢిల్లీ పర్యటన నిమిత్తం వచ్చిన సీఎం చంద్రబాబును ఏపీకి చెందిన కీలక నేత కలిశారు. ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ఇక కూటమిలో భాగమైన ఈయనకు పొత్తులో భాగంగా.. రాజంపేట లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కింది. కానీ ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన మిథున్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటమిని చవిచూశారు.ఈ తరుణంలో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ నేతగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలిసినా.. ఢిల్లీకి బాబు పయనం సమయంలో భేటీ కావడం చర్చకు దారి తీసింది. మాజీ ముఖ్యమంత్రి హోదా గల కిరణ్ కుమార్.. బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై కేంద్రంతో చర్చించాల్సిన అంశాలు.. కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయట.రాజధాని నిర్మాణానికి తాను స్వాగతిస్తానని గతంలో కిరణ్ కుమార్ ప్రకటన సైతం జారీ చేశారు. అయితే రాష్ట్ర తాజా రాజకీయ స్థితిగతులపై చర్చించారా.. లేక బీజేపీ పెద్దలతో ఏమి మాట్లాడాలనే అంశంపై చర్చించారో ఏమో కానీ.. వీరి భేటీ మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.