దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన దసరా నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగినా చడీచప్పుడు లేదు. ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ హడావుడి చేశేవారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్నా వేడుకల్లో కనిపించడం లేదు. దాంతో అసలా తండ్రీ కూతుళ్లకు ఏమైందన్న చర్చ నడుస్తుంది.కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేసీఆర్‌గా అందరికీ పాపులర్ అయిన మాజీ ముఖమంత్రి. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కలేదని 2001లోతెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ టీఆర్ఎస్‌ను స్థాపించిన ఉద్యమ నేత.. అప్పటి నుంచి పన్నెండేళ్లు తెలంగాణ జిల్లాలను ఉప ఎన్నికలతో హోరెత్తిస్తూ.. ఉద్యమాలు నడిపి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలవతో తెలంగాణ సాధించుకోగలిగారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో.. అంటూ సెంటిమెంట్ రగిలించి ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసిన కేసీఆర్.. పవర్ పోగానే సైలెంట్ అయిపోయారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బాత్‌రూమ్‌లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచకిత్స చేయించుకున్న మాజీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చాలా కష్టపడ్డారు. సారూ.. కారూ.. పదహరూ.. స్లోగన్‌తో వాకింగ్ స్టిక్ చేయూతతో ప్రచారం నిర్వహించారు. ఆయన అంత కష్టపడినా ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. పైగా కారు పార్టీకి 8 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై ఆ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిపోయింది.ఇక అప్పటి నుంచి ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు అసెంబ్లీలో కనిపించారు. ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచరం జరిగింది.
తర్వాత కొన్ని రోజులకు ఆయన యాగం నిర్వహించడంతో.. స్థానిక సంస్థల్లో బలనిరూపణకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. దసరా ముహూర్తంగా మాజీ సీఎం మళ్లీ జనంలోకి వచ్చి తన మాటల మంత్రదండం ప్రయోగిస్తారని అందరూ భావించారు. అయితే దసరా బతుకమ్మ పండుగ మొదలై రోజులు గడుస్తున్నా ఆయన ఫాంహౌస్ నుంచి బయటి రావడం లేదు. దాంతో ఆయన ఏం చేస్తున్నారన్న దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసీఆర్‌తో పాటు ఆయన కుమార్తె తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బతుకమ్మ వేడుకల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందడి నడుస్తోంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలై.. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందీ సంబరం .. ఇలా 9 రోజులూ ఆడపడుచుల సందడే సందడి.. పూల పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ మహిళలు ఎంతగానో ఆరాధిస్తారు. బతుకమ్మ సంబరాలు శతాబ్దాలుగా ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రభుత్వం కూడా బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో దీని వైభవం మరింత పెరిగింది.
తెలంగాణ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ బతుకమ్మను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ శ్రేణులు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వ్యాపింప జేసేందుకు ప్రయత్నించాయి. కవిత స్వయంగా బతుకమ్మ ఎత్తుకుంటూ వేడుకల్లో పాల్గొనేవారు. దాంతో ఆ సంబురాలకు మరింత ప్రాచుర్యం లభించింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుకెళ్లారు. ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న ఆమె ఇటీవలే బయటకు వచ్చారు. కాగా, జైల్లో ఉన్న సమయంలోనే కవిత అస్వస్థతకు గురయ్యారని కేటీఆర్ వెల్లడించారు . అనారోగ్య కారణాలను చూపుతూ కవిత బెయిల్ అభ్యర్థించారు.బెయిల్ రాగానే కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్కు వెళ్లాక ఆమె బయటకు రాలేదు. తండ్రి వద్దే ఉంటూ వస్తున్నారు. తల్లి శోభ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కేక్ తినిపిస్తున్న ఫొటోలో కవిత కనిపించారు. అంతే కాని చడీచప్పుడు చేయడం లేదు.., ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి బతుకమ్మ ఇది.
ఎవరు అవునన్నా, కదన్నా .. తెలంగాణలో బతుకమ్మను ప్రాచుర్యంలోకి తెచ్చింది కవితనే చెప్పాలి. తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక సాంస్కృతిక సంస్థను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అలాంటి కవిత ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనక పోవడం గులాబీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బతుకమ్మ మొదలై రోజులు గడుస్తుంది. అయినా అటు కవిత కాని.. ఇటు కేసీఆర్ కాని బయట కనిపించక పోతుండటంతో.. అసలేం జరుగుతుందో ఆ పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదంట.